వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలో కలుపుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇక ఆ వెల్లుల్లి కారంతో కోడి వేపుడు చేస్తే ఆ టేస్ట్ మామూలుగా ఉండదు. అదిరిపోవడం ఖాయం. సాంబార్‌తో సైడ్ డిష్‌లా దీన్ని తిన్నా చాలా బాగుంటుంది. అలాగే సాయంత్రం పూట స్నాక్స్‌లా తిన్నా కూడా ఈ చికెన్ ఫ్రై అదిరిపోతుంది. సాధారణ చికెన్ ఫ్రై తిని బోర్ కొడితే ఒకసారి వెల్లుల్లి కారంతో కోడి వేపుడును ట్రై చేసి చూడండి. దీన్ని చేయడం చాలా సులభం. దీనికి ముందుగా వెల్లుల్లి కారంపొడిని తయారు చేసి పెట్టుకోవాలి.


వెల్లుల్లి కారాన్ని ముందుగా రెడీ చేసుకోవాలి. దీని కోసం దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క తీసుకోవాలి. యాలకులు రెండు, లవంగాలు నాలుగు, జీలకర్ర అర స్పూను, మిరియాలు అర స్పూను, ధనియాలు రెండు స్పూన్లు, కారం ఒక స్పూను, వెల్లుల్లి రెబ్బలు 12 తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జార్లో తీసుకున్న పదార్థాలన్నీ వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువగా చేసుకొని జార్లో వేసుకొని దాచుకుంటే ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు. ఇక వెల్లుల్లి కారంతో చేసే చికెన్ ఫ్రై కోసం... ఈ వెల్లుల్లి కారంలో కాస్త నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతే వెల్లుల్లి కారం మిశ్రమం రెడీ అయినట్టే. ఇప్పుడు దీంతో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.


కావాల్సిన పదార్థాలు
చికెన్ - అరకిలో
ఉల్లిపాయ - ఒకటి
టమోటా - ఒకటి
కరివేపాకులు - గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
నీరు - తగినన్ని
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
నిమ్మరసం - అర స్పూను


తయారీ ఇలా
స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక చికెన్ వేసి కలపాలి. చికెన్  దిగి ఉడుకుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు, కరివేపాకులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వేసి కలిపేయాలి. చిన్న మంటపై పెట్టి అది ఫ్రైలా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చికెన్‌లో నీరంతా  ఇంకిపోయి ముక్కలు పొడిపొడిగా ఉన్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్టును వేసి బాగా కలపాలి. దాన్ని మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. చివరలో కరివేపాకులు చల్లుకోవాలి. కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. చిన్న మంట మీద వేయించి స్టవ్ కట్టేయాలి. ఇది మంచి స్నాక్ లాగా కూడా ఉంటుంది.  వేడివేడిగా సర్వ్ చేస్తే నోరూరిపోవడం ఖాయం. 


వెల్లుల్లితో చేసిన చికెన్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యం. వెల్లుల్లిలోని సుగుణాలు, చికెన్ లోని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. మధుమేహులు వెల్లుల్లితో చేసిన వంటకాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. శరీర బరువు పెరగకుండా అదుపులో ఉంచుతుంది వెల్లుల్లి. ఇక చికెన్ తినడం వల్ల ప్రొటీన్ పుష్కలంగా శరీరానికి అందుతుంది.  వారానికి రెండు సార్లు చికెన్ తినడం వల్ల ప్రొటీన్ లోపం రాకుండా ఉంటుంది. 


Also read: ఇంట్లో నుంచి బల్లులను తరిమేయాలా? ఈ చిట్కాలు పాటించండి