Chest Fat vs Gynecomastia : ఈ మధ్యకాలంలో చాలామంది మగవారు ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిమ్, కార్డియో వంటివి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ప్రజారోగ్యంలో ఆసక్తి చూపుతుండటంతో.. అందరిలోనూ అవగాహన పెరుగుతుంది. అయినప్పటికీ.. జిమ్ చేసేవారికి కూడా తెలియని ఓ సమస్య ఉంది. అదే గైనెకోమాస్టియా, ఛాతీ కొవ్వు. చాలామంది ఈ రెండూ ఒకటే అనుకుంటారు కానీ వాటి మధ్య చాలా తేడా ఉందని చెప్తున్నారు. దీనివల్ల జిమ్‌లో ఛాతీని తగ్గించుకునేందుకు చేసే కొన్ని ప్రయత్నాలు వృధా అవుతాయి.
గైనెకోమాస్టియా vs చెస్ట్ ఫ్యాట్
- గైనెకోమాస్టియా అనేది పురుషులలో రొమ్ము కణజాలం విస్తరించడం వల్ల కలిగే వైద్య పరిస్థితి. ఇది సాధారణంగా దృఢంగా, రబ్బరులా ఉంటుంది. ఆహారం లేదా వ్యాయామం ద్వారా తగ్గదు. హార్మోన్ల మార్పులు, జన్యుశాస్త్రం, మందులు లేదా జీవనశైలి కారకాలు వంటివి దాని అభివృద్ధికి దోహదం చేస్తాయి.
- ఛాతీ కొవ్వు (సూడోగైనెకోమాస్టియా) అంటే.. ఛాతీపై అధిక కొవ్వు కణజాలం ఏర్పడుతుంది. ఇది ఆహార నియంత్రణ, స్ట్రెంత్ ట్రైనింగ్, బాడీ ఫ్యాట్ తగ్గించడం ద్వారా తగ్గుతుంది.
అయితే ఈ రెండు పరిస్థితుల్లో మగవారు భారీ గుండ్రని ఛాతీతో ఇబ్బంది పడతారు. చాలామందికి, జిమ్ ట్రైనర్స్‌కి కూడా ఈ తేడా తెలియక వర్క్ అవుట్స్ చేస్తారు. కానీ రిజల్ట్స్ మాత్రం అనుకూలంగా ఉండవు. దీనివల్ల ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది. దీంతో టైట్ టీ-షర్టులు, స్విమ్మింగ్ పూల్స్ లేదా చేంజింగ్ రూమ్‌లను అవాయిడ్ చేస్తూ ఉంటారు.
తేడా ఇలా గుర్తించండి
చనుమొనల రూపాన్ని బట్టి గైనెకోమాస్టియాను నిర్ధారించవచ్చు. గైనెకోమాస్టియాలోని గ్రంధి సాధారణంగా చనుమొన-అరియోలా కాంప్లెక్స్ కింద ఉంటుంది. ఇది బయటకు పొడుచుకు వచ్చిన రూపాన్ని ఇస్తుంది. వైద్యపరంగా శిక్షణ పొందినవారు కాకపోతే, శిక్షకులు తరచుగా దీనిని కొవ్వుగా భావిస్తారు. దాంతో ఛాతీ వ్యాయామాలను సిఫార్సు చేస్తారు. చెస్ట్ ఫ్యాట్ ఎక్కువగా ఉండేవారు ఫిట్‌నెస్ సెంటర్స్, ట్రైనర్స్ దగ్గరికి వెళ్తారు. అలాంటప్పుడు చెస్ట్ ఫ్యాట్, గైనెకోమాస్టియా మధ్య తేడాను వివరించి.. సరైన మార్గం చూపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఛాతీ దగ్గర కొవ్వును ఫిట్‌నెస్ ప్లాన్‌తో మెరుగుపరచవచ్చు. అయితే నిజమైన గైనెకోమాస్టియాకు అర్హత కలిగిన ప్లాస్టిక్ సర్జన్ చేసే శస్త్రచికిత్స అవసరం. సరైన రోగ నిర్ధారణ, సకాలంలో చికిత్సతో.. మార్పు కేవలం శారీరకంగానే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని, భావోద్వేగ శ్రేయస్సును కూడా పెంచుతుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.