ప్రిన్సెస్ డయానా అంటే "ఆ రోజుల్లో" యువతకు ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగాచెప్పాల్సిన పని లేదు. ఆమె అందం.. బ్రిటన్ రాజ కుటుంబంతో ఆమె బంధుత్వం.. చివరికి అల్ ఫయీద్‌తో కలిసి ప్రమాదంలో చనిపోవడం అంతా... ఓ సినిమా కథలా ఉంటుంది చెప్పుకోవడానికి. ఇప్పటికి సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె గురించి గొప్పగానే చెప్పుకుంటూ ఉంటారు. ఆమె మంచిదా... చెడ్డదా అన్న విషయం పక్కన పెడితే... తాజాగా ఆమె వెడ్డింగ్ కేక్‌లో ఓ ముక్కను ఓ వ్యక్తి రూ. రెండు లక్షలకు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
జూలై 29, 1981న ప్రిన్స్ చార్లెస్, డయానాల పెళ్లి అయింది. ఆ రోజున వారి కోసం కేక్ తయారు చేశారు. పెళ్లి ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ కేసులో ఓ ముక్కను కట్ చేసుకుని ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానా ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆ తర్వాత ఆ కేసులో కొంత ముక్కను తీసి భద్రపరిచారు. ఏ మాత్రం చెడిపోకుండా అత్యంత అధునాతన పద్దతిలో భద్రపరిచిన కేక్ ఇటీవల వేలానికి వచ్చింది. మూడు వందల నుంచి ఐదు వందల పౌండ్లు వస్తాయని ... వేలం నిర్వాహకులు అనుకున్నారు. కానీ గెర్రీ లేటన్ అనే వ్యక్తి మాత్రం.. ఆ కేక్‌ను అత్యంత విలువైన దానిగా భావించారు. ఎంత విలువ అంటే.. కనీసం రూ.రెండు లక్షలు విలువ చేస్తుందని అనుకున్నాడు. అంతకు విలువకట్టి పాడుకున్నారు. డబ్బు కట్టి సొంతం చేసుకున్నారు. డాలర్లలో 2565 డాలర్లు కట్టారు.
బ్రిటన్ రాజ కుటుంబంపై ఎంతో ఆసక్తి..ప్రేమ.. అభిమానం ఉన్న గెర్రీ ఆ కేకును.. తన కోటలో జ్ఞాపికగా భద్రపరచాలని అనుకుంటున్నారు. తన తదనంతరం ఆ కేకును వారసులు చారిటీకి వాడుకుంటారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ కేకు 40 ఏళ్ల కిందటిది. మరో వందేళ్లయినా ఏ మాత్రం చెడిపోకుండా ఉండేలా జాగ్రత్తగా ప్యాక్ చేశారు. అంతే జాగ్రత్తగా సరైన వాతావరణంలో ఆ కేకును ఉంచాల్సి ఉంది. ఈ కేకును వేలం వేసిన సంస్థ... డయాన్ పెళ్లి కేకుకు ఇంత డిమాండ్ ఊహించలేదని చెబుతోంది. తామంటే తాము కొంటామని ఒక్క బ్రిటన్ నుంచే కాకుండా అమెరికా, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా ఆసక్తి కనబరిచారనిచెప్పుకొచ్చింది. 1981లో పెళ్లి చేసుకున్న ప్రిన్స్ చార్లెస్, డయానా జంట మనస్పర్థల కారణంగా 11 ఏళ్ల తర్వాత విడిపోయారు. 1997లో ఆమె కారు ప్రమాదంలో మరణించారు.
ప్రిన్స్ చార్లెస్, డయానాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన ప్రిన్స్ హ్యారీ రాజకుటుంబంపై ఆరోపణలు చేసి.. తన వ్యక్తిగత జీవితాన్ని అమెరికాలో గడపడానికి వెళ్లిపోయారు.