Dont Ignore These Bathroom Symptoms : చాలామంది మలవిసర్జన సమయంలో ఎదురయ్యే సమస్యల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ఈ ఇబ్బందులను ఇతరులతో పంచుకోవడానికి వారు సిగ్గుపడతారు. కానీ అలా చేయకూడదని చెప్తున్నారు వైద్యులు. ఎందుకంటే సరైన సమయంలో వైద్యుడిని సంప్రదిస్తే కొలొరెక్టల్ క్యాన్సర్‌(Colorectal Cancer)ను సులభంగా అధిగమించవచ్చని అంటున్నారు. దీనిని కొలొన్, రెక్టల్ క్యాన్సర్ అని కూడా అంటారు.

Continues below advertisement

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ వ్యాధి ఎక్కువగా వృద్ధులలో కనిపించేది. కానీ ఈ రోజుల్లో యువతలో కూడా దీని కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వారిలో ఈ కేసులు మొదటి, రెండవ దశలలో కాకుండా చివరి దశలలో వస్తున్నాయి.

లక్షణాలు ఎందుకు గుర్తించరంటే

ఈ క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించడానికి ప్రధాన కారణం నొప్పి లేకపోవడం. నిజానికి ఎక్కువ నొప్పి కలిగించే వ్యాధులను మాత్రమే అందరూ తీవ్రమైన సమస్యగా పరిగణిస్తారు. కొలొరెక్టల్ క్యాన్సర్‌లో చాలా మందికి ఈ నొప్పి అనిపించదు. కానీ మలవిసర్జన అలవాట్లలో మార్పు వస్తుంది. దీనిని చాలామంది కడుపులో మంట లేదా పైల్స్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. అనేక అధ్యయనాల ప్రకారం.. మలవిసర్జనలో వచ్చే మార్పు కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రారంభ దశ లక్షణం కావచ్చు.

Continues below advertisement

మలం ఆకారం మారడం

మీకు తరచుగా పెన్సిల్ ఆకారంలో లేదా చాలా పలుచని మలం వస్తుంటే.. దానిని నిర్లక్ష్యం చేయవద్దని చెప్తున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. కణితి (ట్యూమర్) మన పురీషనాళం లేదా పెద్దపేగులో పెరిగినప్పుడు.. అది మలం బయటకు రావడానికి ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల దాని ఆకారంలో మార్పు వస్తుంది.

మలంలో శ్లేష్మం (మ్యూకస్) 

కణితి కారణంగా పెద్దపేగు బయటి ఉపరితలం వాపు వచ్చినప్పుడు.. మలవిసర్జన సమయంలో జెల్లీ లాంటి లేదా జిగట శ్లేష్మం వస్తుంది. అందువల్ల దీనిని నిర్లక్ష్యం చేయవద్దని వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెప్తున్నారు.

మలంలో రక్తం రావడం

మలంలో రక్తం రావడం వల్ల క్యాన్సర్‌ను సులభంగా గుర్తించవచ్చు. నిజానికి.. మిగిలిన లక్షణాలను గుర్తించకపోయినా.. ఈ లక్షణం కనిపించినప్పుడు వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. 

కడుపులో మంట లేదా మలబద్ధకం

మీకు తరచుగా కడుపులో మంటగా ఉంటే లేదా మీకు ఎల్లప్పుడూ మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతుంటే.. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ క్యాన్సర్ కారణంగా కడుపులో ఇలాంటి సమస్యలు రావడం చాలా సాధారణం.

లక్షణాలను త్వరగా గుర్తించండి

మీరు ఈ లక్షణాలను పదేపదే నిర్లక్ష్యం చేస్తే.. అది మీ మొత్తం శరీరంలోకి వ్యాపిస్తుంది. ప్రారంభంలో దాని లక్షణాలను గుర్తించడం ద్వారా మీరు సులభంగా చికిత్స పొందవచ్చు. చివరి దశలో మీ శరీరం ప్రాణాంతక ప్రక్రియను ఎదుర్కోవలసి రావచ్చు. అంతేకాకుండా వ్యాధితో పోరాడే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా దీనిని గుర్తించి చికిత్స తీసుకుంటే మంచిది.