Maintaining Toothbrushes : కొందరు రెగ్యూలర్​గా టూత్​ బ్రష్​ను మార్చుకుంటారు. మరికొందరు ఏమి పాడైందని మార్చాలి.. బాగానే పని చేస్తుంది కదా అని దానిని మార్చకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఇలా చేయడం వల్ల మీ దంత ఆరోగ్యంతో పాటు.. ఆరోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని తెలుసా? నిపుణులేమో.. ప్రతి మూడు నెలలకు ఓ సారి బ్రష్​లు కచ్చితంగా మార్చాలి అంటున్నారు. అసలు టూత్​ బ్రష్​ను ఎందుకు మూడు నెలలకు మార్చాలి? మార్చకపోతే ఏమవుతుంది? మార్చాల్సిన సమయం వచ్చిందని ఎలా గుర్తించాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


నోటి సమస్యలు


మీకు తెలుసా డెంటిస్టులు మీ టూత్​ బ్రష్​ను ప్రతి 12 నుంచి 16 వారాలకు మార్చేయాలని సూచిస్తారు. ఎందుకంటే అది మీ దంత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఈ సూచనలు జారీ చేస్తున్నారు. లేదంటే పలు దంత సమస్యలు తప్పవు అంటున్నారు. నార్మల్ టూత్​ బ్రష్ అంటే తక్కువ కాస్ట్​లో వచ్చేస్తుంది. ఎలక్ట్రానిక్ టూత్ బ్రష్ చాలా కాస్ట్​తో ఉంటుంది. మరి దానిని కూడా మార్చాలా అంటే.. కచ్చితంగా మార్చాలనే అంటున్నారు. మార్చకుంటే దంత ఆరోగ్యం ప్రభావితమై.. ఇన్ఫెక్షన్​ను వ్యాప్తి చేస్తుంది. తద్వార చిగుళ్ల వ్యాధి, దంత క్షయం, నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా త్వరగా విజృంభిస్తాయి. 


బ్రష్ మార్చాల్సిన అవసరం ఏమిటి?


రోజుకు రెండుసార్లు రెండు నిమిషాలు దంతాలు బ్రష్ చేయాలనే రూల్ ఉంది. ఇది దంతాలను కావిటీస్​ నుంచి రక్షిస్తుంది. ప్రతి భోజనం, చిరుతిండి తర్వాత దంతాలను బ్రష్ చేస్తే మంచిది అంటారు. ఇలా రెగ్యూలర్​గా బ్రష్ చేయడం వల్ల బ్రష్​గరికెలు పాడైపోవడం ప్రారంభిస్తాయి. సుమారు 3 నెలల్లో అవి వంగిపోతాయి. నోటిలోని దంతాల మధ్య ఖాళీలను శుభ్రం చేయడానికి స్ట్రైయిట్, మృదువైన బ్రిస్టల్స్​ ఉండాలి. ఇలా ఉన్నప్పుడే దంతాల మధ్య ఆహారం, బ్యాక్టీరియా సమర్థవంతంగా తొలగుతుంది. వంగిపోయిన బ్రిస్టల్స్ దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేవు. అందుకే సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ టూత్​ బ్రష్​ను ప్రతి 3 నెలలకు ఓసారి మార్చమని సలహా ఇస్తుంది. 


ఎలక్ట్రిక్ బ్రష్​ అయితే..


ఎలక్ట్రిక్ టూత్​ బ్రష్​ను కూడా ప్రతి 12 వారాలకు మార్చాల్సి ఉంటుంది. దాని హెడ్ మారిస్తే సరిపోతుంది. మొత్తం బ్రష్​ను మార్చాల్సిన అవసరం లేదు. ఈ టూత్​ బ్రష్​ హెడ్​లు నైలాన్​ బ్రిస్టల్స్​ కలిగి ఉంటాయి. పైగా పొట్టిగా ఉంటాయి. కాబ్టటి ఇవి మరింత త్వరగా పాడైపోవచ్చు. కుదిరితే 12 వారాల కంటే ముందే దీనిని మార్చేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు. 


టూత్ బ్రష్ మార్చడానికి ఇతర కారణాలు


మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే.. అందరి టూత్​ బ్రష్​లు సమయమైనా కాకున్నా మార్చేయడం మంచిది. ఎందుకంటే చాలామంది బ్రష్​లను ఒకే చోట ప్లేస్ చేస్తారు. దీనివల్ల బ్యాక్టిరీయా ఒక బ్రష్ నుంచి మరొకదానికి మారే అవకాశముంది. కుదిరితే ఇంట్లో ఎవరూ అనారోగ్యంగా ఉన్నా వారి బ్రష్​ను సపరేట్​గా ఉంచండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వారి బ్రష్​లు తరచుగా మార్చాలి. ఎందుకంటే వారు బ్రష్​ను కరికేస్తారు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి. ఎవరైనా పొరపాటున మీ టూత్​ బ్రష్ ఉపయోగిస్తే దానిని వెంటనే దూరం పెట్టేయండి. మీరు ఎవరి టూత్ బ్రష్​ కూడా వినియోగించకండి. ఇలా చేస్తే బ్యాక్టిరీయా పెరిగి ఇన్​ఫెక్షన్లకు గురి అవుతారు.


బ్రష్​ను శుభ్రంగా ఎలా చూసుకోవాలంటే..


ఫ్యామిలీతో కలిసి ఉన్నా సరే.. ఎవరి బ్రష్​ను వారు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. లేదు ఒకే కప్పు, కంటైనర్​లో స్టోర్ చేస్తే.. ఒకరి బ్రిస్టల్స్​ మరొకటి బ్రష్​ను తాకకుండా ప్లేస్​ చేయండి. బ్రష్ చేసిన తర్వాత దానిని నీటితో శుభ్రం చేసుకోండి. దానిని శుభ్రం చేయాలనే సాకుతో.. మౌత్ వాష్, వేడి నీళ్లు ఉపయోగించాల్సి అవసరం లేదు. ఇలా చేస్తే బ్యాక్టిరీయా ఇంకా ఎక్కువయ్యే ప్రమాదముంది. దానిని క్లోజ్ చేసి పెట్టకపోవడమే మంచిది. మంచిగా గాలి తగిలే ప్రాంతంలో బ్రెష్​ను ఉంచండి.


Also Read : ఈ దోశ బరువును, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది.. రెసిపీ ఇదే


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.