Skin Aging in Women : వయసు పెరిగే కొద్ది ముసలి లక్షణాలు కనిపించడం సహజం. అయితే  వయస్సు చిన్నదే అయినా వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. అవి వయసు వల్ల కాదని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల్లో కొన్ని అలవాట్ల వల్ల వారి వయసు కంటే పెద్దగా కనిపిస్తారట. మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన దినచర్య, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. చర్మం మెరుపును కూడా తగ్గిస్తాయట. చాలామంది మహిళలను త్వరగా వృద్ధాప్యంలోకి నెట్టే కొన్ని అలవాట్లు ఉన్నాయని.. వాటి నుంచి ఎలా బయటపడాలో సూచనలిస్తున్నారు నిపుణులు. అవేంటంటే.. 

ఒత్తిడి..

ఒత్తిడి వల్ల మానసికంగానే కాకుండా ముఖంపై కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒత్తిడి మీ చర్మాన్ని అలసిపోయేలా చేస్తుందని కొందరు నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల మహిళలు ముందే వృద్ధాప్యంలోకి వెళ్లిపోతున్నారట. వాకింగ్ చేయడం, డైరీ రాయడం, ధ్యానం చేయడం వంటి వాటితో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు.

నిద్ర

సరైన నిద్ర లేకపోవడం వల్ల చర్మ మరమ్మత్తు ప్రక్రియపై నెగిటివ్ ప్రభావం ఉంటుంది. దీనివల్ల మహిళల్లో వృద్ధాప్యం త్వరగా వస్తుంది. రాత్రి నిద్రలో చర్మం తనను తాను బాగు చేసుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మహిళలు తమ చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం అవసరం.

జంక్ ఫుడ్ 

మహిళ ఆహారంలో చక్కెర, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా ఉంటే.. దాని ప్రభావం ముడతల రూపంలో కనిపిస్తుందట. వాస్తవానికి చక్కెర అనేది చర్మంలో వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. దీనివల్ల మహిళలు ముందే వయస్సు కంటే ఎక్కువ పెరగడం ప్రారంభిస్తారు. కాబట్టి మహిళలు కూరగాయలు, పండ్లు, నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలి. 

సన్‌స్క్రీన్ 

కొందరు మహిళలు ఎండలో ఉన్నప్పుడు మాత్రమే సన్‌స్క్రీన్ ఉపయోగిస్తారు. కానీ యూవీ కిరణాలు ఇంటి లోపల కూడా మన చర్మానికి హాని కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మహిళలు ప్రతిరోజూ సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. వాతావరణం ఎలా ఉన్నా, దీన్ని వారి దినచర్యలో చేర్చుకోవాలి. వృద్ధాప్యఛాయలను దూరం చేయడంలో సన్​స్క్రీన్ మంచి ఫలితాలు ఇస్తుంది.

ధూమపానం 

ధూమపానం, మద్యపానం చేయడం వల్ల మహిళల చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చర్మం మెరుపుపోతుంది. వయస్సు ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మహిళలు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను తగ్గించుకోవాలని లేదా పూర్తిగా మానుకోవాలని సూచిస్తారు.

ఇవన్నీ వయసు కంటే ముందుగానే మిమ్మల్ని ముసలివారిగా కనిపించేలా చేస్తాయి. అయితే కొందరు మహిళలు తమపై అస్సలు శ్రద్ద వహించరు. కుటుంబం, వర్క్ అనే బాధ్యతల్లో తమని తాము పట్టించుకోవడం మానేస్తారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే కచ్చితంగా ఇప్పటి నుంచి అయినా కేర్ తీసుకోండి. చర్మాన్ని అనే కాదు.. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిస్తే స్కిన్ ఆటోమేటిక్​గా గ్లో అవుతుంది. అలాగే రెగ్యులర్​గా వ్యాయామం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వైద్యుల సూచనల మేరకు సప్లిమెంట్స్​ కూడా మీ రొటీన్​లో భాగం చేసుకోండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.