Carrot Muffins : పిల్లల ఆరోగ్యం కోసం వారికి హెల్తీ ఫుడ్‌ని పెట్టాలనుకుంటారు. కానీ వారికి అవి నచ్చవు. అలాంటప్పుడు పిల్లలకు నచ్చే విధంగా హెల్తీ ఫుడ్‌ని తయారు చేయవచ్చు. అలాంటి హెల్తీ రెసిపీనే క్యారెట్ మఫిన్లు. ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి చాలా రుచికరంగా ఉండడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో? వాటిని ఎలా తయారు చేయాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
క్యారెట్స్ - 5
కన్డెన్స్డ్ మిల్క్ - 60 మి.లీ
పాల పొడి - 20 గ్రాములు
డ్రై ఫ్రూట్స్ - రుచికి తగినంత
పాలు - పావు కప్పు
తయారీ విధానం
ముందుగా క్యారెట్స్ బాగా కడిగి పైన లేయర్‌ను పీల్ చేయాలి. ఇప్పుడు క్యారెట్స్‌ను బాగా సన్నగా తురుముకోవాలి. ఈ కొలతలకు సరిపడాలంటే రెండు కప్పుల క్యారెట్ తురుము ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై నాన్‌స్టిక్ పాన్ ఉంచండి. అది వేడి అయిన తర్వాత దానిలో క్యారెట్ తురుము వేయండి. తురుములోని తేమ ఆవిరైపోయే వరకు క్యారెట్‌ను వేయించండి. క్యారెట్‌లోని తేమ పోయే వరకు స్టౌవ్ దగ్గరే ఉండి వేయించండి. లేదంటే మాడిపోయే ప్రమాదముంది.
క్యారెట్‌లోని తేమ ఆవిరైపోయాక అందులో పాలు వేయండి. పాలల్లో క్యారెట్ మెత్తబడేవరకు మూత పెట్టి ఉడికించండి. అనంతరం పాల పొడి కూడా వేసి బాగా ఉడికించాలి. ఇప్పుడు దానిలో కండెన్స్డ్ మిల్క్ వేయండి. క్యారెట్ మిశ్రమం మందపాటిగా అయ్యేవరకు బాగా కలపాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిని చల్లారనివ్వండి. మఫిన్ మౌల్డ్ తీసుకుని దానికి బటర్ అప్లై చేయండి. బటర్ అందుబాటులో లేకుంటే గోధుమపిండిని కూడా వేయొచ్చు. ఇది మఫిన్స్ మోల్డ్ స్టిక్ కాకుండా చేస్తుంది.
చల్లారిన క్యారెట్ మిశ్రమాన్ని మఫిన్ మౌల్డ్స్‌లో సగం వరకు పోయాలి. ఓవెన్‌ను180 డిగ్రీల సెల్సియస్ వద్ద 5 నిమిషాలు ప్రీ హీట్ చేయండి. అనంతరం మౌల్డ్స్‌ను ఓవెన్లో ఉంచి 170 డిగ్రీల వద్ద 10 నిమిషాలు బేక్ చేయండి. వాటిని బయటకు తీసి ఓ ప్లేట్లోకి మార్చండి. అంతే హెల్తీ, టేస్టీ క్యారెట్ మఫిన్స్ రెడీ. వీటిని మీరు డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేయవచ్చు. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు హెల్తీ స్నాక్ పెట్టాలనుకుంటే ఇది చాలా మంచి ఎంపిక. ఎందుకంటే క్యారెట్ మఫిన్స్ వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు కూడా అందుతాయి.
క్యారెట్లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని, కంటి చూపును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లలను రక్షిస్తాయి. గొంతునొప్పి, జలుబు, ఇన్ఫ్లూఎంజా వంటి వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా శరీరానికి పోషకాలు అందిస్తాయి. పిల్లలు మఫిన్స్ వంటి వాటిని ఇష్టంగా తింటారు కాబట్టి హెల్తీ ఫుడ్‌గా వీటిని మీరు వారికోసం తయారు చేసి తినిపించవచ్చు. అయితే వీటిని పిల్లలే కాదు.. పెద్దలు కూడా హెల్తీ స్నాక్‌గా తీసుకోవచ్చు.
Also Read : బరువు తగ్గాలంటే ఈ ఫ్రూట్స్ తినాలంటున్న నిపుణులు - ఎందుకంటే?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.