క్యారెట్ సుగుణాలు ఇన్నీ అన్నీ కావు. దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మరెన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. చర్మ ఆరోగ్యానికి ఇది మరీ మంచిది. క్యారెట్లో ఉండే కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే బీటా కెరాటిన్ విటమిన్ ఎ గా మారి ఆరోగ్యానికి రక్షగా నిలుస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తనాళాలకు చాలా మేలు చేస్తుంది.రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల గుండె సంబంధ వ్యాధులు, హైబీపీ వంటివి కూడా రావు. వీటిని రోజూ తినేవారిలో మలబద్ధకం సమస్య రాదు. మహిళలు, పిల్లలు కచ్చితంగా వీటిని రోజూ తినాలి. ఎందుకంటే వీరిలోనే రక్త హీనత సమస్య అధికంగా వస్తుంది. క్యారెట్ ఆ సమస్యకు చెక్ పెడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ముందుంటుంది. దీన్నిండా విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ వండుకుని తినే కన్నా పచ్చిగా తింటనే బోలెడన్ని లాభాలు.
క్యారెట్ తో రకరకాల వంటలు చేసుకోవచ్చు. వేపుడు, సాంబారు, కూరలు, స్వీట్లు ఇలా ఎన్నో టీస్టీ వంటకాలు వీటితో సిద్ధమవుతాయి. క్యారెట్ తో చేసే లడ్డూ కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఓసారి ప్రయత్నించి చూడండి. చేయడం చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు
క్యారెట్ తురుము - అరకిలో
పచ్చి కొబ్బరి తురుము - వందగ్రాములు
పంచదార - పావుకిలో (తగ్గించుకోవచ్చు కూడా)
నెయ్యి - రెండు స్పూనులు
వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్ - గుప్పెడు (అన్నింటి తరుగు)
యాలకుల పొడి - అర టీస్పూను
తయారీ ఇలా
1. ముందుగా క్యారట్లు శుభ్రంగా కడుక్కుని తురుములా చేసుకోవాలి.
2. కళాయిలో నెయ్యి వేసి క్యారెట్ తురుమును వేయించాలి. పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
3. తరువాత కొబ్బరి తురుమును కూడా చేర్చాలి. రెండు నిమిషాలు వేయించాక గరిటెతో బాగా కలిపి మూత పెట్టేయాలి. 4. ఓ అయిదు నిమిషాల తరువాత మూత తీసి పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి.
5. నీరంతా దిగి మిశ్రమం కాస్త దగ్గరగా గట్టిగా అయ్యేదాకా బాగా కలపాలి.
6. జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్ లు, యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి.
7. మిశ్రమం లడ్డూల చుట్టేందుకు వీలుగా గట్టిగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
8. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టి చిన్న బాక్సులో వేసి మూత పెట్టి ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల పాటూ తాజాగా ఉంటాయి.
పిల్లలకు ఇవి మంచి స్వీట్ అని చెప్పవచ్చు. శక్తి కూడా అందుతుంది. పైగా ఆరోగ్యం కూడా.
Also read: మెన్‌స్ట్రువల్ కప్ చూసి భయపడకండి, దాన్ని వాడడం చాలా సులువు
Also read: బెడ్ షీట్లు మార్చడానికి అంత బద్ధకమా? సర్వేలో షాకింగ్ నిజాలు
Also read: వినూత్నంగా ఆవులకూ ఫేస్ మాస్క్‌లూ, వాటి నుంచి వచ్చే విషవాయువును అడ్డుకోవడానికే ఇదంతా