గత దశాబ్ద కాలంగా క్యాన్సర్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. రకరకాల క్యాన్సర్ల వల్ల చాలా మంది మరణిస్తున్నారు కూడా. చాలా క్యాన్సర్లకు ప్రత్యేక లక్షణాలు లేకపోవడం వల్లే గుర్తించడంలో ఆలస్యం జరుగుతోంది. నిజానికి క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే దాదాపుగా అన్ని క్యాన్సర్లకు చికిత్సలు అందుబాటులో ఉంటాయి. అలా సమయానికి గుర్తించి క్యాన్సర్ ను జయించిన వారు కూడా ఉన్నారు. అందుకే క్యాన్సర్ లో అత్యంత కీలకమైన అంశం సమస్యను గుర్తించడమే. ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులభం అవుతుంది. అంతే ప్రభావవంతంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. ఈ క్యాన్సర్లను సమయానికి గుర్తిస్తే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
ఓవేరియన్ క్యాన్సర్‌ను గుర్తించడం అంత సులభం కాదు. ఈ క్యాన్సర్ ముదిరిపోయే వరకు పెద్ద లక్షణాలేమీ కనిపించవు. కానీ త్వరగా గుర్తిస్తే పూర్తిగా చికిత్స సాధ్యపడే క్యాన్సర్లలో ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఒకటి. ప్రతి రోజు దాదాపు 4వేల మంది ఓవేరియన్ క్యాన్సర్ తో మరణిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించని ఈ వ్యాధిని త్వరగా గుర్తించడం చాలా కష్టం. కానీ అతి చిన్న మార్పులు కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.
కొన్ని సమస్యలు స్త్రీలలో చాలా సాధారణంగా ఉండే అనారోగ్యాల మాదిరిగానే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి వెన్నునొప్పి. అంతేకాదు రాత్రి భోజనం సమయంలో కనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఓవేరియన్ క్యాన్సర్ కు సంకేతాలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూడండి.
లండన్‌కు చెందిన వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజనం చేస్తున్నప్పుడు త్వరగా కడుపు నిండినట్టు అనిపించడం, లేదా ఆకలి మందగించడం వంటివి అండాశయ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి కావచ్చని అంటున్నారు. ఒక్కోసారి ట్యూమర్ కడుపులోని ఇతర అవయవాల మీద ఒత్తిడి కలుగజేయడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయట. అందువల్ల పూర్తి స్థాయిలో భోజనం చేయడం వీలు కాదని అంటున్నారు. ఇలా రెగ్యులర్ గా జరుగుతుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ను కలవడం అవసరం అని అంటున్నారు.
కడుపు త్వరగా నిండిన భావన కలగడం అనేది ఒక లక్షణం కావచ్చు. కానీ ఓవేరియన్ క్యాన్సర్‌ను అనుమానించేందుకు మరికొన్ని లక్షణాల గురించి కూడా అక్కడి నిపుణులు వివరించారు.
⦿ తెలియని ఒక చిన్న నొప్పి కడుపులో నిరంతరాయంగా ఉండడం
⦿ కడుపు ఎప్పుడూ ఉబ్బరంగా ఉన్నట్టు ఉండడం
⦿ తరచుగా అజీర్తి చెయ్యడం
⦿ వెన్నునొప్పి లేదా నడుము నొప్పి
⦿ బవెల్ మూమెంట్స్ లో తేడాలు
⦿ మెనోపాజ్ తర్వాత కూడా రక్తస్రావం కనిపించడం
⦿ విపరీతమైన అలసట
పై లక్షణాలు కూడా మీలో కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన్న క్యాన్సర్ కావచ్చని భయపడాల్సిన పనిలేదు. ఇవి మరే ఇతర చిన్నచిన్న అనారోగ్యాల వల్ల కూడా కావచ్చు. కానీ క్యాన్సర్ లో కూడా ఇలాంలాంటి లక్షణాలు కనిపిస్తాయని మాత్రమే నిపుణులు తెలుపుతున్నారు.
Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.