హిందీ చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శక - నిర్మాత సతీష్ కౌశిక్ (Satish Kaushik) మృతి చెందారు. గుండెపోటు కారణంగా ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్ళు. సతీష్ కౌశిక్ మృతి విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. 


దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో గురుగావ్ (Gurgaon)లో గల ఓ వ్యవసాయ క్షేత్రానికి సతీష్ కౌశిక్ వెళ్లారు. అక్కడ ఒకరితో సమావేశం అయ్యారు. మీటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా... కారులో హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే సమీపంలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అయినా ప్రయోజనం దక్కలేదు. తిరిగిరాని లోకాలకు సతీష్ కౌశిక్ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఫోర్టిస్ ఆస్పత్రిలో సతీష్ కౌశిక్ పార్థీవ దేహం ఉంది. పోర్ట్ మార్టం పూర్తి అయిన తర్వాత బాడీని అప్పగించనున్నారు. 'ఏబీపీ న్యూస్'తో ప్రత్యేకంగా మాట్లాడిన అనుపమ్ ఖేర్, స్నేహితుని మరణ వార్తను ధృవీకరించారు. 


ముంబైలో అంత్యక్రియలు
పోస్ట్ మార్టం, ఇతరత్రా కార్యక్రమాలు పూర్తైన తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకి సతీష్ కౌశిక్ పార్థీవ దేహాన్ని తరలించనున్నారు. ముంబైలో సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. 


మాది 45 ఏళ్ళ స్నేహం - అనుపమ్ ఖేర్
''మరణం నిజమని నాకు తెలుసు. కానీ, నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ కౌశిక్ గురించి ఈ విధంగా రాస్తానని కలలో కూడా ఊహించలేదు. మాది 45 ఏళ్ళ స్నేహం. దానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడింది. నువ్వు లేని జీవితం ఇంతకు ముందులా, ఒకే విధంగా ఉండదు సతీష్'' అని అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. స్నేహితుడితో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు.





హరియాణా టు హిందీ సినిమా
సతీష్ కౌశిక్ స్వస్థలం హరియాణాలోని మహేంద్రఘడ్‌. ఆయన 1956 జన్మించారు. హిందీ సినిమా 'మాసూమ్' (1983) ద్వారా నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు మాటలు రాశారు. దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, ఆయన కలిసి కొన్ని చిత్రాలు నిర్మించారు.


'మిస్టర్ ఇండియా', 'దీవానా మస్తానా', 'బ్రిక్ లేన్', 'రామ్ లఖన్', 'సాజన్ చలే ససురాల్' తదితర చిత్రాల్లో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఛత్రివాలి'లో కూడా సతీష్ కౌశిక్ కనిపించారు. రిషి కపూర్ చివరి సినిమా 'శర్మాజీ నమకీన్'లోనూ ఆయన నటించారు. 'మిస్టర్ ఇండియా' సినిమాలో కామెడీ రోల్ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. సతీష్ కౌశిక్ నటించిన 'ఎమర్జెనీ' ఇంకా విడుదల కావాల్సి ఉంది. అందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారి. 


బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన 'జానే భీ దో యారోన్' (1983) చిత్రానికి సతీష్ కౌశిక్ మాటలు రాశారు. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన 'రూప్ కి రాణి చారోన్ కి రాజా' సినిమాతో సతీష్ కౌశిక్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సల్మాన్ ఖాన్, భూమిక జంటగా నటించిన 'తేరే నామ్' దర్శకుడు కూడా ఆయనే. సుమారు 15 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన తీసిన చివరి సినిమా 'కాగజ్'.


Also Read : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం