పచ్చిమిరపకాయలు, టమోటాలు ఒకేసారి అమాంతం ధర పెరిగిపోయింది. కిలో కొనాలంటే రూ.150 నుంచి 200 రూపాయలు ఖర్చుపెట్టాలి. ఇక ఢిల్లీ, నోయిడా వంటి ప్రాంతాలో వీటి ధర కిలో నాలుగు వందల రూపాయలు ఉన్నట్టు అంచనా. ధనవంతులు ఎలాగూ ఎంతైనా ఖర్చు పెట్టి కొనుక్కుంటారు. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి వారికే కష్టాలు. వారు కొనలేరు, కొనకుండా ఉండలేరు. మధ్యలో నలిగిపోతారు. పచ్చి మిరపకాయలు లేకపోతే రుచి రాదేమో అనుకుంటారు. అలాంటి వారికే ఈ చిట్కాలు. పచ్చి మిరపకాయల ధర తగ్గేవరకు వాటి అవసరం లేకుండా ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో కూరలకు మంచి రుచిని తెచ్చుకోవచ్చు.
నల్ల మిరియాలు తెలుగిళ్లల్లో సాధారణంగా ఉంటాయి. ఈ నల్ల మిరియాలను పచ్చిమిరపకాయలకు బదులు ఉపయోగించుకోవచ్చు. ఈ నల్ల మిరియాలు కొంచెం దంచి పొడిలా చేసి పెట్టుకోండి. కూరల్లో వేసుకోవడం వల్ల కాస్త ఘాటు, కారం కూరకి వస్తుంది. నల్ల మిరియాలు తినడం కూడా ఎంతో ఆరోగ్యం. నిజానికి పచ్చిమిరపకాయల కన్నా నల్ల మిరియాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బిర్యానీలలో, మాంసం వంటకాలలో కూడా నల్ల మిరియాల పొడి వేయడం వల్ల రుచి బాగుంటుంది. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది.
ప్రతి ఇంట్లో కారంపొడి ఉంటుంది. పచ్చిమిర్చికి బదులు కారప్పొడిని వాడుకోవచ్చు. కానీ ఎక్కువ మంది పచ్చిమిర్చి ఉంటే దాన్ని వాడడానికే ఆసక్తి చూపిస్తారు. పచ్చిమిర్చి ధరలు తగ్గే వరకు కొన్ని రోజులు పాటు కారాన్ని వాడడం మంచిది. కారంలో కాస్త నల్ల మిరియాలు పొడి కలిపి కూరలకు మంచి రుచి వస్తుంది. అయితే కారంపొడి కన్నా ఎండుమిర్చిని మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకోవాలి. వాటిని కూరల్లో వేసుకోవడం వల్ల మంచి రంగుతోపాటు రుచి కూడా వస్తుంది. ఘాటుతన కూడా తెలుస్తుంది. కారంపొడి ఎక్కువగా వేయడం ఇష్టం లేకపోతే, ఆ ఘాటు కారపు రుచి కోసం కారాన్ని గరం మసాలాని కలిపి కొన్ని రోజులు పాటు వాడుకోవచ్చు. ఇది కూడా మంచి రుచిని అందిస్తుంది. అలాగే కూరలకు మంచి ఎరుపు రంగును కూడా అందిస్తుంది. ముఖ్యంగా మాంసాహారాన్ని ఇలా వండితే ఎంతో మంచిది. కారంతో పాటు నోరూరించే రూపం కూడా మాంసాహార వంటకాలకు ఇస్తుంది. కారం, గరం మసాలా కలిపిన మిశ్రమాన్ని రెడీ చేసిపెట్టుకుని ఉంటే మంచిది.
పచ్చిమిర్చి ధర తగ్గే వరకు కూరకారాన్ని తయారుచేసి పెట్టుకుంటే మంచిది. కూరకారం తయారీలో ఎలాంటి పచ్చిమిర్చి అవసరం ఉండదు. కాబట్టి కూరలో పచ్చిమిర్చి వేయకుండా ఈ కూర కారాన్ని చల్లుకున్నా చాలు, ఎంతో రుచి వస్తుంది. కూర కారం తయారీలో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, సెనగపప్పు, మినప్పప్పు, ఎండు మిరపకాయలు వంటివి వాడతారు. వీటన్నింటినీ కళాయిలో వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసుకునేటప్పుడు కొంచెం చింతపండును కూడా వేస్తే మంచి రుచిగా ఉంటుంది. కూరల్లో ఈ కారప్పొడిని వేస్తే పచ్చిమిర్చి అవసరం కూడా ఉండదు. రుచి కూడా అదిరిపోతుంది. ఒక్కసారి చేసి చూడండి మీకే నచ్చుతుంది. ముఖ్యంగా వేపుళ్ళు చేసేటప్పుడు చివరిలో ఈ కారాన్ని జల్లితే ఆ టేస్టే వేరు. కొంతమంది కూరకారంలో వెల్లుల్లిని కూడా వేసి ‘వెల్లుల్లి కారం’గా మారుస్తారు. అది కూడా మంచి రుచిని అందిస్తుంది. పచ్చిమిర్చి బదులు వెల్లుల్లి కారాన్ని వాడినా మంచి ఫలితం ఉంటుంది.
Also read: మహిళలకు నెలసరి సెలవు కావాల్సిందే, తేల్చి చెప్పిన సర్వే
Also read: వారిద్దరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, ఆయనతో కలిసి ఉండలేకపోతున్నా