AI Reduce Healthcare Burden in India : భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక రోగుల జనాభా ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులపై భారీ ఒత్తిడి ఉంటోంది. దీంతో ఆస్పత్రికి వెళ్తే గంటల తరబడి వేచి ఉండాలి. ముఖ్యంగా అవుట్‌పేషెంట్ విభాగాల్లో ఈ రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. నిపుణులైన వైద్యుల కొరత, పరిపాలనా పనిభారం, దీర్ఘకాలిక వ్యాధుల పెరుగుదల వంటి కారణాలతో రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య రంగంలో రోగుల రద్దీని తగ్గించడానికి, చికిత్స అందించడానికి కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI)
కీలక సహాయక సాధనంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు.
 
వైద్య రంగంలో ఏఐ వినియోగం గురించి యశోద హాస్పిటల్స్​లో క్లినికల్ డైరెక్టర్, ఆంకాలజీ విభాగం & సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్​గా చేస్తోన్న డాక్టర్ సచిన్ మార్దా స్పందించారు. సచిన్ ప్రకారం AI అనేది వైద్యులను భర్తీ చేయడానికి రాలేదు. వైద్యులు, నర్సులు తమ సమయాన్ని ఎక్కువగా రోగుల సంరక్షణకు కేటాయించేందుకు సహాయపడేలా చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పేషెంట్లతో వైద్యులు ఎక్కువ సమయం గడపవచ్చు.

ఆటోమేటిక్ రిమైండర్లు

ఆస్పత్రుల్లో అపాయింట్‌మెంట్ల నిర్వహణ, రోగుల నమోదు, మెడికల్ రికార్డ్స్, రిపోర్ట్స్ తయారీ, ఫాలోఅప్ రిమైండర్లు పంపించడం వంటి పనులను AI వేగంగా, సమర్థవంతంగా నిర్వహించగలుగుతుందని తెలిపారు. దీని వల్ల వైద్యులు, స్టాఫ్ కంప్యూటర్ స్క్రీన్ ముందు గడిపే సమయం తగ్గి, రోగులతో మరింత సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఆరోగ్య సేవల నాణ్యత పెరగడంలో ఇది కీలకంగా మారవచ్చని డాక్టర్ సచిన్ తెలిపారు.

రోగుల రద్దీ ఎలా తగ్గుతుంది?

రోజులో ఏ సమయంలో ఎక్కువ మంది రోగులు వస్తున్నారు? ఏ విభాగంలో ఎక్కువ రద్దీ ఉంది? ఎక్కడ జాప్యం జరుగుతోంది? వంటి అంశాలను AI సులభంగా విశ్లేషించగలదు. ఈ సమాచారంతో ఆస్పత్రి యాజమాన్యం ముందుగానే ప్రణాళికలు రూపొందించి అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచవచ్చు. దీని వల్ల రద్దీ తగ్గడంతో పాటు వైద్యులను కలిసేందుకు, పరీక్షలు చేయించుకోవడానికి, అడ్మిషన్ పొందడానికి పట్టే సమయం కూడా చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది.

వైద్యుడి దగ్గరకు త్వరగా వెళ్లొచ్చు 

భారతదేశంలో చాలా మంది రోగులు నేరుగా పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం వల్ల అక్కడ అధిక రద్దీ ఏర్పడుతోంది. కొన్నిసార్లు ఏ విభాగానికి వెళ్లాలో తెలియక అనవసరంగా ఒక డాక్టర్ నుంచి మరొక డాక్టర్ వద్దకు తిరుగుతారు. అలాంటప్పుడు AI ఆధారిత ట్రయాజ్ వ్యవస్థలు రోగి లక్షణాలను విశ్లేషించి అతడిని సరైన విభాగం లేదా నిపుణుడి దగ్గరికి పంపించగలవు. దీంతో అనవసర రిఫరల్స్ తగ్గి, రోగికి సరైన చికిత్స త్వరగా అందే అవకాశం పెరుగుతుంది.

వైద్యులపై పనిభారం తగ్గొచ్చు 

AI ఆధారిత వాయిస్-టు-టెక్స్ట్ సిస్టమ్స్ వైద్యుడు చెప్పిన విషయాలను ఆటోమేటిక్‌గా రికార్డు చేసి మెడికల్ నోట్స్‌గా మార్చగలవు. దీంతో పేపర్‌వర్క్ తగ్గి వైద్యుల పనిఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా బర్నౌట్ సమస్యను ఎదుర్కొంటున్న ఆరోగ్య సిబ్బందికి ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చని డాక్టర్ సచిన్ అన్నారు. 

AI ఒక్కటే పరిష్కారం కాదు

AI ఎంత అభివృద్ధి చెందినా వైద్యుడి అనుభవం, క్లినికల్ నిర్ణయాలు, రోగి పట్ల సానుభూతి, నైతిక విలువలు, వైద్యుడు-రోగి మధ్య నమ్మకాన్ని భర్తీ చేయలేడు. సాంకేతికత అనేది ఒక సహాయక సాధనంగా మాత్రమే చూడాలని నిపుణులు అంటున్నారు. అలాగే AI సమర్థవంతంగా పనిచేయాలంటే బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా భద్రత, స్పష్టమైన నియంత్రణ వ్యవస్థలు, నిరంతర పర్యవేక్షణ అవసరమని.. ఇవి లేకపోతే ఆశించిన ఫలితాలు రావడం కష్టమని అంటున్నారు.

ఆరోగ్య సేవల్లో AI కీలక పాత్ర

AIని సరైన విధంగా వినియోగిస్తే ఆస్పత్రుల్లో వేచి చూసే సమయాన్ని తగ్గించడమే కాకుండా.. రోగులకు మెరుగైన అనుభవాన్ని అందించగలదు. అలాగే ఇండియాలో ఈ మధ్యకాలంలో ఏఐ సేవలతో సర్జరీలు, చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ మార్పుల్లో సాంకేతికత ఎంత ముఖ్యమో, వైద్యుల పాత్ర కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని మర్చిపోకూడదని నిపుణులు చెప్తున్నారు.