Tips to Choose Mangoes for Avakaya : వేసవికాలం వచ్చిందంటే చాలు.. దాదాపు ప్రతి ఇంట్లో మామిడి పచ్చడి పడతారు. ఆవకాయ, మాగాయి, పెసర ఆవకాయి అంటూ వివిధ రకాల పచ్చళ్లు తయారు చేసి పెట్టుకుంటారు. ఉగాది తర్వాత పచ్చడి మామిడి కాయల సందడి మొదలవుతుంది. అయితే ఈ ఆవకాయ సీజన్‌లో మంచి నాణ్యమైన మామిడి కాయలు కొనడం చాలా ముఖ్యం. సరైన కాయలు తీసుకోకపోతే పచ్చడి రుచి, నిల్వ కాలం రెండూ ప్రభావితం అవుతాయి. కాబట్టి పచ్చడి మామిడి కాయలు కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మామిడి కాయలు కొనేప్పుడు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.
గట్టి కాయలు
పచ్చడి కోసం మామిడి కాయలు కొనాలనుకుంటే ముందుగా చెక్ చేసుకోవాల్సింది.. అది గట్టిగా ఉందో లేదో అని. కాయను చేతితో నొక్కితే మృదువుగా ఉంటే అది పండిపోయినట్లు అర్థం. గట్టిగా ఉంటే.. అది పచ్చడికి మంచిదని అర్థం చేసుకోవాలి.
మచ్చలు, డాగులు లేనివి..
కాయపై నల్లని మచ్చలు, కోతలు, దెబ్బలు ఉంటే వాటిని తీసుకోకూడదు. అలాంటి మామిడి కాయలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి కాయ గట్టిగా ఉండడంతో పాటు.. ఎలాంటి మచ్చలు లేకుండా ఉండేవి చూసుకోవాలి.
తురుము తక్కువ బెటర్..
పచ్చడికి తురుము తక్కువగా ఉండే మామిడి రకాలు బెస్ట్. ఇవి కట్ చేసినప్పుడు సాఫ్ట్‌గా ఉండి రుచి బాగా ఇస్తాయి. అలాగే గింజ చిన్నగా ఉంటే గుజ్జు ఎక్కువగా ఉంటుంది. పచ్చడికి ఇలాంటివి మంచి ఎంపికగా చెప్పవచ్చు.
పులుపు ఎక్కువగా ఉంటే..
పచ్చడి రుచి బాగా రావాలంటే కాయ పులుపుగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి కాస్త పుల్లగా ఉండే కాయలు తీసుకోవాలి. కాయలను స్మెల్ చేస్తే.. పులుపు రుచి తెలుస్తుంది. అలాంటివి ఎంచుకుంటే బాగుంటుంది. చెడు వాసన వస్తే లేదా కాయ పాడైందని అనిపిస్తే పక్కన పెట్టేయండి.
నీళ్లు ఎక్కువగా ఉండే కాయలు..
నీరు చాలా ఎక్కువగా ఉండే మామిడి కాయలు పచ్చడిని త్వరగా పాడుచేస్తాయి. కాబట్టి మామిడి కాయను కట్ చేసినప్పుడు లోపల డ్రైగా ఉండేలాంటి కాయలు ఎంచుకోవాలి. అలాగే పాత కాయలు కొనకూడదు. లేదంటే అవి త్వరగా కుళ్లిపోతాయి. తాజాగా వచ్చినవే తీసుకోవాలి.
ఒకే సైజ్ కాయలు
కాయల మధ్య పెద్ద తేడాలు లేకుండా.. మరీ పెద్దగా, చిన్నగా కాకుండా.. మిడిల్ సైజ్ కాయలు పచ్చడికి ఎంచుకోవాలి. మీడియం సైజ్ మామిడి కాయలు పచ్చడికి బెస్ట్.
ఒకే రకం కాయలు
వివిధ రకాల మామిడి కాయలు మిక్స్ చేస్తే పచ్చడి రుచి మారిపోతుంది. కాబట్టి ఒకే వేరైటీ తీసుకుంటే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది.
ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు మంచి మామిడికాయలు పచ్చడి కోసం కొనగోలు చేసుకోవచ్చు. అయితే కాయలు కొనుకున్న తర్వాత వెంటనే కట్ చేయకుండా.. ఒకరోజు గాలిలో ఉంచి.. తుడిచి వాడితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లేదా నీళ్లు లేకుండా మామిడికాయలను బాగా తుడిచి.. కట్ చేసి.. కాసేపు గాలికి ఆరనిస్తే.. పచ్చడిలో నీరు చేరకుండా ఉంటుంది. ఇది పచ్చడి ఎక్కవకాలం నిల్వ ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.
