Brisk Walking vs Reverse Walking Which is Better : శారీరక, మానసిక ప్రయోజనాలు అందించడంలో వాకింగ్ బాగా హెల్ప్ చేస్తుంది. అయితే నడకను ఎలా నడిస్తే మంచి ప్రయోజనాలు ఉన్నాయి. వేగంగా నడిస్తే బరువు తగ్గుతారా? లేకుంటే వెనక్కి నడిస్తే ఆరోగ్యానికి మంచిదా? ఈ రెండిటీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? నష్టాలున్నాయా? ఆరోగ్య ప్రయోజనాల కోసం బ్రిస్క్ వాక్ (Brisk Walking) మంచిదా? లేదా రివర్స్ వాక్ (Reverse Walking) మంచిదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. 

బ్రిస్క్ వాకింగ్

బ్రిస్క్ వాకింగ్ అంటే వాకింగ్​కి ఎక్కువ.. జాగింగ్​కి తక్కువ. అంటే నడకను కాస్త వేగంగా నడవడం. అలా అని పరిగెత్తడం కాదు. వేగంగా నడవడాన్ని బ్రిస్క్ వాకింగ్ అనొచ్చు. ఇది గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది. 

రివర్స్ వాకింగ్ 

సాధారణంగా నడిచే నడకను ముందుకు కాకుండా రివర్స్​లో నడవడాన్ని.. అంటే వెనక్కి నడవడాన్ని రివర్స్ వాకింగ్ అంటారు. కండర బలాన్ని పెంచుతుంది. 

బ్రిస్క్ వాక్​ వల్ల కలిగే ప్రయోజనాలు.. 

గుండె సమస్యలు దూరం : బ్రిస్క్ వాకింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అయితే ఇది వ్యక్తి ఫిట్​నెస్ స్థాయిని బట్టి మారుతుంది. గుండె కండరాలు కష్టపడి పనిచేసి బలంగా తయారవుతాయి. రక్త ప్రవాహం మెరుగవుతుంది. బీపీని కంట్రోల్ చేసి.. గుండె జబ్బులు, స్ట్రోక్ రాకుండా హెల్ప్ చేస్తాయి. గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది. 

బరువు తగ్గేందుకు : బరువు తగ్గడంలో బ్రిస్క్ వాకింగ్ మంచి ప్రయోజనాలు ఇస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. రెగ్యులర్​ వాకింగ్ కంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల మీరు రెస్ట్ తీసుకున్నా.. కేలరీలు కరుగుతూ ఉంటాయి. 

మధుమేహం మాయం : ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో బ్రిస్క్ వాకింగ్ హెల్ప్ చేస్తుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్​లో ఉండి.. శరీరం ఇన్సులిన్​ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. క్రమంగా టైప్ 2 డయాబెటిస్​ను నిరోధించడంలో హెల్ప్ చేస్తుంది. 

స్ట్రెస్ దూరం : బ్రిస్క్ వాకింగ్ శారీరక ప్రయోజనాలే కాదు.. మానసిక ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. ఎండార్ఫిన్​లను విడుదల చేసి.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ లక్షణాలు తగ్గుతాయి. 

బ్రిస్క్​ వాకింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇవే

బ్రిస్క్ వాకింగ్ సరిగ్గా చేయకపోతే కీళ్ల నొప్పి ఎక్కువ అవుతుంది. కొత్తగా ఈ వాక్​ని ప్రారంభించేవారిలో కండరాల నొప్పులు పెరుగుతాయి. సరైన జాగ్ర్తత్తలు తీసుకోకుండా వేగంగా నడిస్తే బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. పాదాలపై బొప్పలు రావడం, నొప్పి రావడం జరగొచ్చు. 

రివర్స్ వాకింగ్​ వల్ల కలిగే ప్రయోజనాలివే.. 

ఫోకస్ పెరుగుతుంది : రివర్స్ వాకింగ్​ని రెట్రో వాకింగ్ అని కూడా అంటారు. ఇది స్ట్రెస్​ని తగ్గిస్తుంది. రొటీన్​కు భిన్నంగా చేయడం వల్ల సమన్వయం పెరుగుతుంది. ఫోకస్ పెరుగుతుంది. వంగిపోకుండా స్ట్రైట్​గా నడిచేలా శరీరాన్ని మైండ్ ప్రేరేపిస్తుంది. 

కండర బలం : రివర్స్ వాకింగ్ కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది. హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్​కు బలం అందుతుంది. బాడీని టోన్​ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అథ్లెటిక్ పనితీరును బెటర్ చేస్తుంది. భంగిమను మెరుగుపరుస్తుంది. 

కీళ్ల నొప్పులు దూరం : రివర్స్ వాకింగ్ వల్ల కీళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఇది చాలా మంచిది. రివర్స్ వాకింగ్ బరువును కీళ్లు అంతటికి సమానంగా పంపిణీ చేసి.. నొప్పులను దూరం చేస్తుందని అధ్యయనాలు తెలిపాయి. 

బరువు తగ్గడానికి : రివర్స్ వాకింగ్ వల్ల కేలరీలు ఎక్కువగా బర్న్ కాకపోయినా బరువు తగ్గడంలో మంచి ప్రయోజనాలు అందిస్తుంది. మంచి డైట్​తో రివర్స్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

రివర్స్ వాకింగ్ సైడ్ ఎఫెక్ట్స్ 

వెనక్కి నడవడం వల్ల పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నడిచే ప్లేస్​లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి. కొత్త కదిలికలకు అలవాటు పడని కండరాలు పనిచేసేలా చేస్తుంది కాబట్టి వాటికి నొప్పి వచ్చే అవకాశముంది. 

బ్రిస్క్ వాకింగ్ vs రివర్స్ వాకింగ్

బ్రిస్క్ వాకింగ్, రివర్స్ వాకింగ్ రెండూ వాటి ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. మీ శారీరక స్థితి, ఫిట్​నెస్​ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీటిని ఫాలో అవ్వొచ్చు. గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలనుకునే వారు బ్రిస్క్ వాకింగ్​ని ఎంచుకోవచ్చు. కండరాల బలాన్ి పెంచుకోవాలనుకునేవారు, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు రివర్స్ వాకింగ్ ఎంచుకోవచ్చు. అయితే మీరు దేనిని ఎంచుకున్నా.. వైద్యుల సలహా తీసుకుని ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. 

Also Read : పరగడుపునే వాకింగ్ చేస్తే కలిగే లాభాలు ఇవే.. మరి తిన్న తర్వాత నడవకూడదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి?