ఎనభై అయిదు రూపాయలకు కడుపు నిండా భోజనమే రాదు, అలాంటివి ఏకంగా ఇల్లు కొనేశాడు ఒక వ్యక్తి. ఎక్కడో తెలుసా? ఇటలీలో. అంత తక్కువ ధరకు ఇల్లు ఎలా లభించిందని చాలా మంది ఆశ్చర్యపోతుండచ్చు. ఇటలీలోని చిన్న పట్టణాలు కొన్ని రకాల షరతులతో కేవలం ఒక యూరోకే ఇళ్లను అమ్ముతున్నాయి. అది కూడా కేవలం విదేశీయులకే. విదేశీయులు ఇళ్లు కొనుక్కోవడం వల్ల రాకపోకలు పెరిగి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఇటలీ అధికారుల ఆశ. ‘కేస్ 1 యూరో’ అని ఆ పథకానికి పేరు పెట్టారు. ఒక యూరో అంటే మన రూపంయల్లో 85 రూపాయలు.
కొన్నాడు కానీ...
ఇటలీలోని సిసిలీ నగరంలోని ముస్సోమెలి అనే ప్రాంతంలో కేవలం ఒక యూరోకే (రూ.85) బ్రిటన్‌కు చెందిన డానీ మెక్ కబ్బిన్ ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అంత తక్కువ ధరకు రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు.అది ఒక పాత ఇల్లు. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. శుభ్రం చేయాలి కూడా. దానికోసం పనివాళ్లు దొరకుతారేమోనని ఏడాదిగా వెతుకుతున్నాడు. ఇంతవరకు ఒక్కరు కూడా ఇల్లు పని పూర్తిచేసేందుకు దొరకలేదు. 58 ఏళ్ల మెక్ తానొక్కడే పనులు పూర్తి చేయలేదు. ఇంటి పనులు చేసేందుకు కూడా పని వాళ్లు దొరకలేదు. దీంతో ఏం చేయాలో తోచక మెక్ తిరిగి ఆ ఇంటిని అతి కష్టమ్మీద అదే ధరకు అమ్మేశాడు. తిరిగి తన ప్రాంతానికి వచ్చేశాడు. ఆ ఇల్లును అమ్మడానికి కూడా మెక్ కు చుక్కలు కనిపించాయి. ఎలాగోలా ఒక బిల్డర్ కు ఆ ఇంటిని అప్పగించాడు.
ముస్సోమెలి ప్రాంతం 14వ శతాబ్ధం నాటి పురాతన గ్రామం. ఇక్కడ విదేశీయుల సంఖ్య పెంచి పూర్వ వైభవం తేవాలన్నది ఆ నగర అధికారుల ప్లాన్. ఇటలీ దేశ వ్యాప్తంగా కొన్నాళ్లుగా కార్మికుల కొరత పెరిగింది. దీంతో ఆ దేశం చాలా దెబ్బతింది. కరోనా వచ్చాక పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారాయి.