Crispy and Tasty Makka Garelu : మరికొన్ని రోజుల్లో బోనాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంవత్సరం జూన్ 26 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయి. పండుగ సమయంలో అమ్మవారికి ఇష్టమైన బోనాలు సిద్ధం చేయడంతో పాటు ఎన్నో రకాల వంటలు నైవేద్యంగా పెడతారు. వాటిలో అమ్మవారికి ఇష్టమైన మక్క గారెలు కూడా ఉంటాయి. అయితే ఈసారి కాస్త వెరైటీగా, మరింత రుచిగా ఈ మక్కగారెలు చేయాలనుకుంటే ఈ టేస్టీ రెసిపీని ఫాలో అయిపోవాలి. ఈ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటి? వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
స్వీట్ కార్న్ - 2
మినపప్పు - 1 కప్పు
ఉప్మా రవ్వ - అరకప్పు
పచ్చిమిర్చి - 3
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
అల్లం - ఒక అంగుళం
ఉప్పు - రుచికి తగినంత
వంట సోడా - 1 టీస్పూన్
కొత్తిమీర తురుము - అరకప్పు
తయారీ విధానం
ముందుగా మినపప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. లేదంటే మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. మినపప్పు నానిన తర్వాత దానిని మిక్సీలో వేసుకోవాలి. గారెల కోసం నీటిని వేయకుండా పిండిని మిక్సీ చేసుకోవాలి. తప్పదు అనుకుంటే కాస్త నీటిని చిలకరించాలి. కానీ పిండి మాత్రం గట్టిగానే ఉండేలా సిద్ధం చేసుకోవాలి. ఈ పిండిని పక్కన పెట్టి స్వీట్ కార్న్ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దానిని కూడా ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో మినపపిండి, స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ కాస్త నీటిని వదులుతుంది కాబట్టి దానిలో ఉప్మారవ్వ వేసుకోవాలి. లేదు అనుకుంటే బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. పిండి వదులుని బట్టి ఉప్మారవ్వ లేదా బియ్యం పిండ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దానిలో ముందుగా తురిమిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేయాలి. కొత్తిమీర తురుము, ఉప్పు, వంటసోడా వేసుకోవాలి.
మిశ్రమాలు అన్ని బాగా కలిసేలా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకోవాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె కాగే వరకు పిండిని అలా పక్కన వదిలేయాలి. నూనె వేడి అయిన తర్వాత స్టౌవ్ని మీడియంలోకి పెట్టి పిండిని తీసుకుని గారెలుగా చేసుకోవాలి. వాటిని నూనెలో వేసి వేయించుకోవాలి.
గారెలు రెండూ వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం పిండితో గారెలు చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కరకరలాడే మినప మక్క గారెలు రెడీ. వీటిని పండుగ సమయంలోనే కాకుండా మీకు నచ్చిన సమయంలో చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి ఎక్కువసేపు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ బోనాలకు కాస్త వెరైటీగా ఈ మినప మక్కగారెలు చేసి ఇంటిల్లిపాదికి రుచి చూపించేయండి.