బ్లూ బెర్రీ పండ్లను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి ముదురు ఊదా రంగును కలిగి ఉంటాయి. సాధారణ బ్లూ బెర్రీ పండ్లతో పోలిస్తే, వైల్డ్ బ్లూ బెర్రీ పండ్లు ఆంథోసైనిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు 33% ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచేందుకు సహకరిస్తాయి. మెదడు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా ఆ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. బ్లూ బెర్రీ పండ్లను కేవలం ఊదా రంగులోనే కాదు ఎరుపు, నీలం రంగుల్లో కూడా లభిస్తాయి. వీటిలో పాలీఫెనాల్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే అవి మెదడు రక్తనాళాల ద్వారా రక్తప్రవాహం సవ్యంగా జరిగేలా చూస్తాయి. దీనివల్ల ఆరోగ్యకరమైన అభిజ్ఞా పని తీరు లభిస్తుంది. అంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడులో వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది.
స్కూలుకెళ్లే పిల్లలకు రోజు ఐదు నుంచి ఆరు బ్లూ బెర్రీ పండ్లను తినిపించండి. వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదివినది ఎక్కువ కాలం పాటూ గుర్తుంటుంది. 12 వారాలు పాటు క్రమం తప్పకుండా తిన్నవారిలో జ్ఞాపకశక్తి పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ బ్లూ బెర్రీ పండ్లను తినేవారిలో రక్త పోటు కూడా అదుపులో ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉండడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బ్లూ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన మూలం. ఈ సమ్మేళనాలను మన శరీరానికి అందించాల్సిన అవసరం ఉంది. ఇవి న్యూరో డిజెనరేటివ్ డిజార్డర్ రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి బ్లూ బెర్రీ పండ్లను పిల్లలకు రోజూ తినిపించేందుకు ప్రయత్నించండి.
బెర్రీలలో బ్లూ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్పెబెర్రీస్ పండ్లరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మెదడుకు సహకరించేవే. బ్లూ బెర్రీలు తినడం వల్ల అందానికి మేలు జరుగుతుంది. మొటిమల సమస్యను తగ్గిస్తుంది. వీటిలో సాలిసిలిక్ యాసిడ్ అనే ఆమ్లం ఉంటుంది. ఇవి చర్మాన్ని రక్షిస్తుంది. మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా బ్లూ బెర్రీలు అడ్డుకుంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి అధికంగా ఉంటాయి. ఇవన్నీ మనకి అత్యవసరమైన విటమిన్లు.
Also read: జాగ్రత్త పడండి, పెరిగిపోతున్న మధుమేహం కేసులు - భవిష్యత్తులో 130 కోట్ల మందికి డయాబెటిస్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.