Tips to Reduce Bloating : తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఈ సమస్యలను చాలామంది ఎదుర్కొంటారు. ఇలా అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. తరచుగా పొట్ట ఉబ్బినట్లు అనిపించడం నుంచి.. తిన్న తర్వాత బరువు పెరిగిన ఫీల్ ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే మీరు తిన్న ఫుడ్ తక్కువే అయినా సరే వేసుకున్న దుస్తులు టైట్ అయిపోవడం, గ్యాస్ పైకి తన్నినట్లు అనిపించడం జరుగుతుంది. దీనినే ఇంగ్లీషులో బ్లోటింగ్ అంటారు. 

బిజీ లైఫ్, అన్​హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని కంట్రోల్ చేయడానికి మందులు అవసరం లేదని.. ఇంట్లో ఉండే కొన్ని ఫుడ్స్​తో సమస్యను తగ్గించుకోవచ్చని డాక్టర్. లోకేంద్ర గౌడ్ తెలిపారు. ''బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బడం, గ్యాస్ ఏర్పడటం, పొట్టలో భారంగా అనిపించడం. ఇది శారీరక అసౌకర్యాన్ని మాత్రమే కాకుండా, ఆత్మవిశ్వాసం, శక్తిని కూడా తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరానికి ప్రతిసారీ మందులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. వంటింట్లో ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించే అనేక గృహ నివారణలు ఉన్నాయి'' అని తెలిపారు. అవేంటో చూసేద్దాం..

సోంపు, వాము పొడి

సోంపు, వాము రెండూ కూడా పొట్టలో పేరుకున్న గ్యాస్, బ్లోటింగ్‌ను చాలా ప్రభావవంతంగా తగ్గిస్తాయి. కాబట్టి రెండింటినీ సమాన మోతాదులో తీసుకుని వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని భోజనం చేసిన తర్వాత అర టీస్పూన్ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది. ఆఫీస్లకు, బయటకు వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 

అల్లం టీ

అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పొట్ట ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గిస్తాయి. అల్లం చిన్న ముక్కను తీసుకుని దానిని నీటిలో వేసి మరిగించి ఆ నీరు తాగాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవచ్చు. 

ఇంగువ నీరు

ఇంగువ గ్యాస్ సమస్యకు పురాతన ఆయుర్వేద నివారణగా చెప్తారు. చిటికెడు ఇంగువను గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. కావాలంటే బొడ్డు చుట్టూ కూడా రాసుకోవచ్చు. ఇది తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది.

పుదీనా, నిమ్మరసం

పుదీనా, నిమ్మకాయ రెండూ పొట్టలోని వేడిని తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. పుదీనా ఆకుల రసం తీసి, అందులో నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు కలిపి భోజనం చేసిన తర్వాత తీసుకుంటే మంచిది.

లెమన్ వాటర్..

ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర నిమ్మకాయ కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని టాక్సిన్లు కూడా బయటకుపోతాయి. దీనివల్ల బ్లోటింగ్‌ సమస్య కూడా తగ్గుతుంది. 

బ్లోటింగ్ ఒక సాధారణ సమస్యే అయినప్పటికీ.. దానిని విస్మరించడం మంచిది కాదు. అలా అని ప్రతిసారీ మందులు వాడటం కూడా సరైన మార్గం కాదు. అందుకే ఈ ఇంటిచిట్కాలు ఫాలో అవుతూ ఉంటే మంచిది. అలాగే మీరు తిన్నవెంటనే కూర్చోవడం కాకుండా ఓ పదినిమిషాలు వాకింగ్ చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.