Stuntman Raju Died In Shooting Set: కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. షూటింగ్ సెట్స్‌లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా... ఊహించని ప్రమాదంలో ఓ స్టంట్ మ్యాన్ మృతి చెందారు. ఆర్య హీరోగా పా రంజిత్ దర్శకత్వం వహిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వెట్టువన్'. తమిళనాడు చెన్నైలోని నాగపట్నం సమీపంలో ఓ గ్రామంలో గత 3 రోజులుగా టీం షూట్ చేస్తున్నారు.

యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా...

షూటింగ్‌లో భాగంగా ఆదివారం యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా... స్టంట్ మ్యాన్ మోహన్ రాజు కారులో నుంచి బయటకు దూకుతూ గుండెపోటుకు గురయ్యారు. దీన్ని గమనించిన మూవీ టీం వెంటనే అతన్ని నాగపట్నం సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో టీం విషాదంలో మునిగిపోయింది. కాంచీపురం నెహ్రూ పూంగడం ప్రాంతానికి చెందిన రాజు ఎన్నో సినిమాల్లో సాహసవంతమైన స్టంట్స్ చేశారు. కార్ జంపింగ్ స్టంట్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

విశాల్ సంతాపం

స్టంట్ మ్యాన్ రాజు మృతి పట్ల హీరో విశాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'సినిమా షూటింగ్‌లో కారులో నుంచి దూకుతూ గుండెపోటుకు గురై స్టంట్ మ్యాన్ రాజు చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. రాజు నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నా మూవీస్‌లో ఎన్నో డేంజరస్ స్టంట్స్ చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఒక్క ట్వీట్‌తోనే నా పని నేను చేసుకోలేను. రాజు కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాను.' అని పేర్కొన్నారు.

ఒక గ్రేట్ స్టంట్ ఆర్టిస్ట్‌ను కోల్పోయామని స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వ అన్నారు. రాజు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన... స్టంట్ యూనియన్, చలన చిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటని అన్నారు. 'గ్రేట్ కార్ జంపింగ్ స్టంట్ ఆర్టిస్ట్స్‌లో రాజు ఒకరు. స్టంట్ యూనియన్, చిత్ర పరిశ్రమ ఆయన్ను మిస్ అవుతోంది.' అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేశారు.

Also Read: చంద్రబాబు Vs వైఎస్ఆర్ - 'మయసభ' టీజర్‌పై ట్రోలింగ్స్... డైరెక్టర్ దేవా కట్టా రియాక్షన్