మూత్రాశయం లైనింగ్ కణజాలంలోని కొన్ని కణాలు మారినప్పుడు లేదా పరివర్తన చెందినప్పుడు మూత్రాశయ క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. మూత్రాశయంలోని కణితులు విస్తరించి అసహజ కణాలుగా మారుతుంది. మూత్రాశయ గోడల ద్వారా సమీపంలోని శోషరస కణుపులకి వ్యాపించే అవకాశం ఉంది. తర్వాత అది ఎముకలు, ఊపిరితిత్తులు లేదా కాలేయానికి చేరుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరికీ మూత్రాశయ క్యాన్సర్ రావడం చాలా సాధారణం. అయితే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స చేయడంలో మహిళలకి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ప్రత్యేక శ్రద్ధ అవసరం.


మహిళల్లో మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలు


☀ మూత్రాశయ క్యాన్సర్ అత్యంత సాధారణ సంకేతాలలో ఒకటి మూత్రంలో రక్తం. అయితే మూత్రవిసర్జనలో రక్తం పడితే ఖచ్చితంగా ఈ క్యాన్సర్ అవుతుందని గ్యారెంటీ లేదు.


☀ మూత్రాశయ క్యాన్సర్ మహిళా రోగులు తరచూ మూత్ర విసర్జనకి వెళతారు. ఈ లక్షణం అప్పుడప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా జరుగుతుంది. కానీ ఇదే కొనసాగితే మాత్రం వైద్యులని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.


☀ మూత్ర విసర్జన చేసేటప్పుడు విపరీతమైన నొప్పి, బాధ కలుగుతుంది. నిరంతరం ఇలాగే ఉంటే మూత్రాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు.


☀ మూత్రాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న స్త్రీలు వారి మూత్రాశయం నిండుగా లేనప్పటికీ అకస్మాత్తుగా మూత్ర విసర్జన చేస్తారు. ఇది రోజువారీ జీవనానికి అంతరాయం కలిగిస్తుంది.


మూత్రాశయ క్యాన్సర్ నివారణలు


ధూమపానం వద్దు: మూత్రాశయ క్యాన్సర్ కు ముఖ్యమైన కారకం ధూమపానం. ఈ క్యాన్సర్ వృద్ధి తగ్గాలంటే ధూమపానం చేసే మహిళలు మానేయాలి. నికోటిన్ వ్యసనాన్ని అధిగమించడానికి వైద్య చికిత్సను తీసుకోవడం మంచిది.


హైడ్రేట్ గా ఉండాలి: క్రమం తప్పకుండా ఎక్కువగా నీరు తీసుకోవాలి. ఇది మూత్రాశయం నుంచి క్యాన్సర్ కారకాలని బయటకి పంపించేందుకు సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తే తప్ప ప్రతి రోజు కనీసం 8 కప్పుల నీటిని తాగడం లక్ష్యంగా పెట్టుకోవాలి.


ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తీసుకోవాలి. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మూత్రాశయ ఆరోగ్యంతో సహ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.


కెమికల్ ఎక్స్ పోజర్ నివారించాలి: హెయిర్ డైస్, హెయిర్ ప్రొడక్ట్స్ లో వేసే కెమికల్స్ తయారీ ఫీల్డ్ లో మహిళలు పని చేయడం పరిమితం చేయాలి. వాటి వల్ల ఈ క్యాన్సర్ మరింత పెరుగుతుంది. అందుకే సరైన రక్షణ పరికరాలు ఉపయోగించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.


మూత్రాశయ క్యాన్సర్ చికిత్స


శస్త్ర చికిత్స: స్త్రీలకు మూత్రాశయ క్యాన్సర్ కి చికిత్స చేయాల్సి వస్తే శస్త్ర చికిత్స కీలకం. కణితి ప్రారంభ దశలో ఉన్నప్పుడే తొలగిస్తారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారినప్పుడు రాడికల్ సిస్టేక్టమీ అవసరం కావచ్చు. అంటే మూత్రాశయం తొలగిస్తారు.


కీమోథెరపీ: క్యాన్సర్ కణాలని తొలగించడానికి కీమోథెరపీ అవసరం అయితే నిర్వహిస్తారు. తీవ్రమైన పరిస్థితుల్లో చికిత్స చేసేందుకు ఇంట్రావీనస్ కీమోథెరపీ చేస్తారు.


రేడియేషన్ థెరపీ: ఇది క్యాన్సర్ కణాలని నాశనం చేస్తుంది. అధిక శక్తి కలిగిన రేడియేషన్ వినియోగిస్తారు. ఒక్కోసారి శస్త్ర చికిత్స, రేడియేషన్ థెరపీ రెండూ కలిపి ఉపయోగించవచ్చు.


ఇమ్యూనోథెరపీ: పెంబ్రోలిజుమాబ్, అటెజోలిజుమాబ్ వంటి ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్లుతో చికిత్స చేస్తారు. ఈ మందులు క్యాన్సర్ కణాలతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: 20 ఏళ్లుగా సెలవులోనే ఉన్న టీచర్, కారణాలు ఏం చెప్పిందో తెలుసా?