Corona Virus: ఇప్పటి వరకు వచ్చిన అన్ని కరోనా వేరియంట్లో అతి వేగంగా పాకుతున్న వేరియంట్ BF.7. అందుకే చైనాలో వీటి బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అక్కడ్నించి ఇతర దేశాలకు కూడా త్వరగానే పాకేసింది. ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందంటే ఒక మనిషి నుంచి దాదాపు 10 నుంచి 18 మందికి సోకగలదు. అందుకే చైనా అతి త్వరగా దీని గుప్పిట్లో చిక్కుకుంది. అంతేకాదు ఈ వేరియంట్ మూడు వ్యాక్సిన్లు తీసుకున్న వారిపై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. చైనాలోని షాంఘైలోని అతి పెద్ద ఆసుపత్రి తన సిబ్బందికి పోరాటానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. ఎందుకంటే ఆ నగరంలో సగం జనాభా ఈ వేరియంట్ బారిన పడే అవకాశం ఉందని అంచనా. అంతేకాదు గణాంకాల ప్రకారం చైనాలో 15 లక్షల మంది మరణించవచ్చట.
ఆ దేశాల్లో...
చైనా నుంచి బ్రెజిల్, అమెరికా, జపాన్‌లలోనూ కోవిడ్ కేసులు అధికంగా పెరిగాయి. భారత్‌లో కూడా కేసులు బయటపడడం మొదలైంది. ఒక్కసారిగా... మరో వేవ్ రూపంలో BF.7 విరుచుకుపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు మళ్లీ సామాజిక దూరం, మాస్క్‌లు పాటించాల్సిన అవసరం ఉంది. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, విదేశాల నుంచి వచ్చే వారిని ఐసోలేట్ చేయాలని కూడా వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
మరో కోవిడ్ వేవ్ వస్తుందా?
BF.7 కేసులు ఇలాగే పెరిగితే మరో కోవిడ్ వేవ్ వచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ‘లేదు’ అనే సమాధానం చెబుతున్నారు వైద్యనిపుణులు. కాకపోతే శ్వాసకోశ సమస్యల రోగులు ఎక్కువ అవుతారని భావిస్తున్నట్టు చెప్పారు. కానీ మరో వేవ్ రావడం, అది లాక్‌డౌన్‌కు కారణమవ్వడం జరగకపోవచ్చని అంటున్నారు. DR V.K పాల్స్ (నీతి ఆయోగ్ సభ్యులు) చెప్పిన ప్రకారం, మనదేశంలో 27-28% మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకున్నారు. మిగతా అందరూ కూడా బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిది.
Also read: భయపెడుతున్న BF.7 వేరియంట్, మరో వేవ్ వస్తే లక్షల్లో ప్రాణనష్టం? - దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే
ఈ జాగ్రత్తలు...
మొదటి వేవ్ వచ్చిన సమయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నామో... ఇప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. అయితే BF.7 వేరియంట్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చు. మాస్క్ కచ్చితంగా పెట్టుకునే బయటికి వెళ్లాలి. శానిటైజర్ అందుబాటులో ఉంచుకోవాలి. ఇక సామాజిక దూరం తప్పకుండా పాటించాలి. కలిసి దగ్గరగా కూర్చుని తినడం, తాగడం వంటివి చేయకూడదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.