Immune Boosting Soup Recipe : చలికాలంలో జలుబు, జ్వరం, దగ్గు వంటి అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. కాబట్టి ఈ సమయంలో రోగ నిరోధక శక్తి చాలా అవసరం. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది కంటి ఆరోగ్యం, చర్మానికి, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సాహిస్తుంది. అందుకే పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన పోషకాలలో బీటా కెరోటిన్ ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి, చర్మ, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ నష్టాలను అరికడుతుంది. విటమిన్ సితో నిండిన సూప్.. బలమైన రోగనిరోధక వ్యవస్థను, రోజువారీ పోషకాలను అందిస్తుంది.
వీటన్నింటిని మీరు బీటా కెరోటీన్ సూప్‌లో పొందవచ్చు. దీనిలో కెరోటినాయిడ్.. కొన్ని క్యాన్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ సూప్‌లోని విటమిన్ ఎ.. మీలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయం చేస్తుంది. అదేలా సాధ్యం అనుకుంటున్నారా? ఆహారంలోని బీటా కెరోటిని.. శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ ఎ గా మారుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ వెజ్ సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన విషయాలు ఏంటి? దీనివల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
టమోటాలు - 3
బీట్రూట్లు - 2 (చిన్నవి)
క్యారెట్ - 1
ఉల్లిపాయ - 1
జీలకర్ర - అర టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
ఉప్పు- రుచికి తగినంత
పెప్పర్ పౌడరు - చిటికెడు
తయారీ విధానం
ముందుగా టమోటాలు, బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయలను చిన్నగా తురుముకోవాలి. వీటన్నింటినీ కుక్కర్లో వేయాలి. దానిలో జీలకర్ర వేసి.. కప్పు నీరు పోసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. ప్రెజర్ అంతా బయటకు వెళ్లేవరకు ఆగండి. కుక్కర్లో ప్రెజర్ పోయి.. చల్లారే వరకు వేచి ఉండండి. ఇప్పుడు ఉడికించిన కూరగాయాలను బ్లెండర్లో వేసి.. మెత్తని పేస్ట్ వచ్చే వరకు బ్లెండ్ చేయండి.
ఇలా కూరగాయలను ఉడికించి పేస్ట్ చేయడం వల్ల కూరగాయల్లోని పచ్చివాసన తగ్గుతుంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి నాన్‌స్టిక్ పాన్ పెట్టాలి. అది వేడి అయిన తర్వాత మిక్సీ చేసుకున్న కూరగాయల పేస్ట్ వేయాలి. అనంతరం గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అది బాగా మరిగే వరకు ఉంచి.. స్టవ్ ఆపేయాలి. వేడిగా ఉన్నప్పుడు తాగితే.. ఉదయాన్నే చలి వదిలి.. మీరు రోజంతా చురుగ్గా ఉంటారు. మధుమేహం ఉన్నవారు కూడా ఈ హాట్ సూప్‌ను తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. చల్లని ఉదయానా.. వేడి వేడి సూప్ చేసి తాగేయండి.
Also Read : మీకు మధుమేహం ఉందా? అయితే ఈ స్మూతీ రెసిపీ మీకోసమే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.