నవ్వు నాలుగు విధాల చేటు అనే వారు ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం నవ్వు నలభై విధాల ఆరోగ్యం అని చెబుతున్నారు. ఎవరైనా నవ్వితే... కారణమేంటి? అని అడుగుతారు చాలా మంది. ఈసారి మీరు నవ్వినప్పుడు ‘ఎందుకు నవ్వుతున్నావ్’ అని ఎవరైనా అడిగితే ఆరోగ్యం కోసం అని చెప్పేయండి. ఎంత నవ్వితే  అంత ఆరోగ్యం మరి. శారీరకంగానే కాదు మానిసిక ఆరోగ్యానికీ నవ్వు చాలా అవసరం. నవ్వును నలుగురితో పంచుకుంటే మరీ ఆనందం. నవ్వు ఒత్తిడి స్థాయిలను తగ్గించడంతో పాటూ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రపంచం నవ్వుల  దినోత్సవం సందర్భంగా నవ్వడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవిగో. 


ఒత్తిడి తగ్గుతుంది
మనస్పూర్తిగా నవ్వడం వల్ల, బిగ్గరగా నవ్వడం వల్ల ఎన్ని ప్రయోజనాలో. ముఖ్యంగా నవ్వు ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోను స్థాయిలను తగ్గిస్తుంది. సంతోషాన్నిచ్చే ఎండార్ఫిన్లతో పాటూ డోపమైన్, గ్రోత్ హార్మోన్లను పెంచుతుంది. ఈ పని శరీరంలో భౌతికంగా, భావోద్వేగాల పరంగా ఒత్తిడిని జయించేలా చేస్తుంది. 


అంతర్గత వ్యాయామం
కొందరికి నవ్వి నవ్వి పొట్ట నొప్పి వచ్చేస్తుంది. అంతగా నవ్వాలని చెబుతోంది ఓ పరిశోధన. అలా పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం వల్ల అంతర్గతంగా వ్యాయామం చేసినట్టు అవుతుంది. ఈ వ్యాయామం గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. 


రోగనిరోధక శక్తి
నవ్వు శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి కణాలను పెంచుతుంది. తద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తి టి కణాల ప్రభావాన్ని పెంచుతుంది. టి కణాలంటే ఎముక మజ్జలో స్టెమ్ సెల్స్ ఏర్పడడంలో కీలకపాత్ర పోషిస్తాయి. 


రక్త ప్రసరణ
మేరీ ల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల అభిప్రాయం ప్రకారం కామెడీ ప్రోగ్రామ్ లు చూస్తూ నవ్వే వారిలో రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. అంటే నవ్వడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. అదే భయానకమైన సీన్లు, ఏడుపు సీన్లు చూస్తే మాత్రం రక్తనాళాల్లో ప్రసరణ సరిగా ఉండదు. అందుకే కామెడీ సీన్లు చూసేందుకే ఎక్కువ మంది ప్రయత్నించడం మంచిది. 


రక్తంలో చక్కెర స్థాయిలు
మధుమేహ వ్యాధిగ్రస్తులు బిగ్గరగా, సంతోషంగా నవ్వడం చాలా ముఖ్యం. ఒక అధ్యయనం ప్రకారం ఇలా నవ్వడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా తగ్గుతుంది. ఒక కామెడీ షో చూశాక 19 మంది డయాబెటిక్ రోగుల చక్కెర స్థాయిలను గమనిస్తే వారిలో గ్లూకోజ్ స్థాయిలు చాలా మెరుగుపడినట్టు గుర్తించారు. కాబట్టి డయాబెటిక్ రోగులు రోజూ కామెడీ షోలు చూస్తూ నవ్వడం చాలా ముఖ్యం. 


Also read: వాటర్ మెలన్ తిన్న తరువాత నీళ్లు తాగకూడదంటారు, ఎందుకు?



Also read: ఒక్క ఇంజెక్షన్ మూడు నెలలు గర్భం రాకుండా అడ్డుకుంటుంది, ఇంతకీ ఇది మంచిదేనా?