ఏదైనా ఆహారం తినే ముందు అది ఆరోగ్యపరంగా మేలు చేస్తుందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ మైసూర్ పాక్‌ను తినడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. కాబట్టి బీట్‌రూట్ మైసూర్ పాక్‌ను తిని చూడండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది, పైగా ఎంతో రుచి కూడా. దీని రంగు కూడా నోరూరించేలా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
బీట్ రూట్ - రెండు
శెనగపిండి - ఒక కప్పు
చక్కెర - ఒక కప్పు
నెయ్యి - ఒకటిన్నర కప్పు
తయారీ ఎలా
బీట్‌రూట్‌ను సన్నగా తరిగి, మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. ఒక కప్పు జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి శెనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. స్టవ్ కట్టేశాక ఆ పిండిని జల్లెడ పట్టాలి. పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో నెయ్యి వేసి బాగా కలపాలి. అలా కలిపాక పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కళాయి పెట్టాలి. అందులో పంచదార, బీట్ రూట్ జ్యూస్ వేసి చిన్న మంట మీద తీగపాకం తీయాలి. తీగపాకం వచ్చాక ముందుగా కలిపి పెట్టుకున్న నెయ్యి శనగపిండి మిశ్రమాన్ని వేసి కలపాలి. గరిటతో కలుపుతూనే ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. అంతా బాగా కలిసాక ఒక అరకప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. వీటిలో నెయ్యి ఇగిరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఒక ప్లేటుకు నెయ్యిని రాసి మిశ్రమాన్ని వేడిగా ఉండగానే అందులో వేయాలి. చల్లారే వరకు ఉంచి... చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి. నోరూరించే బీట్‌రూట్ మైసూర్ పాక్ రెడీ అయినట్టే.
బీట్ రూట్ తో వండిన వంటకాలు తినడం వల్ల రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది. దీన్ని తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. పిల్లలు, మహిళలు కచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో బీట్ రూట్ ముఖ్యమైనది. కాలేయం శుభ్రం అవ్వడానికి కూడా బీట్ రూట్ చాలా అవసరం. చర్మం కూడా ఈ కూరగాయ వల్ల మెరుపు సంతరించుకుంటుంది. ఎన్నో చర్మ సంబంధిత రోగాలు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. శరీరం అంతటా ఆక్సిజన్ సవ్యంగా ప్రసారం కావడానికి ఈ కూరగాయ చక్కగా పనిచేస్తుంది. రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే చర్మం యవ్వనంగా మారిపోతుంది. మధుమేహం ఉన్న వారు ఈ కూరగాయను అధికంగా తినాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముందుంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు బీట్ రూట్ రోజూ తిన్ని మంచిదే.
Also read: మా చెల్లి చేస్తున్న తప్పును నేను భరించాల్సి వస్తోంది, నాన్నకు చెప్పడం ఎలా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.