Common Causes of Premature Grey Hair : ఈ రోజుల్లో చిన్న పిల్లలు, టీనేజర్లలో కూడా తెల్ల జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం వయసు పెరగడం వల్ల వచ్చే మార్పు కాదు. దీని వెనుక ఆరోగ్యం, పోషకాహారానికి సంబంధించిన కారణాలు ఉంటాయి. సరైన సమయంలో జాగ్రత్త తీసుకోకపోతే.. జుట్టు త్వరగా తెల్లబడుతుంది. ముఖ్యంగా విటమిన్ B12 లోపం వల్ల జుట్టు వయసు కంటే ముందే తెల్లగా మారుతుంది. 

Continues below advertisement

విటమిన్ బి12 లోపమే కాకుండా.. అధిక ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి కూడా ఈ సమస్యను పెంచుతాయి. సరైన ఆహారం, తగినంత నీరు, సహజమైన హెయిర్ కేర్ పద్ధతులు పాటించడం ద్వారా జుట్టు త్వరగా తెల్లగా మారకుండా నివారించవచ్చు. దాని సహజ రంగును ఎక్కువ కాలం నిలుపుకోవచ్చు.

జుట్టు తెల్లబడటానికి కారణం 

జుట్టు రంగు మెలనిన్ అనే పిగ్మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. శరీరంలో విటమిన్ B12 లోపం ఏర్పడినప్పుడు.. మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోయి, జుట్టు తెల్లబడుతుంది. విటమిన్ B12 ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి, నాడీ వ్యవస్థకు చాలా అవసరం. దీని లోపం వల్ల జుట్టు బలహీనపడటమే కాకుండా వయసు కంటే ముందే తెల్లబడుతుంది.

Continues below advertisement

విటమిన్ B12 లోపాన్ని ఎలా దూరం చేసుకోవాలి?

దీని కోసం ముందుగా డాక్టర్‌ను సంప్రదించి.. బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. రిపోర్ట్ ఆధారంగా డాక్టర్ సూచించిన సప్లిమెంట్లు లేదా మందులను మాత్రమే వాడాలి. దీనితో పాటు విటమిన్ B12 సహజంగా లభించే గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పుట్టగొడుగులు వంటి ఆహార పదార్థాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ పదార్థాలు శరీరంలో B12 లోపాన్ని పూరించడానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

తెల్ల జుట్టును కవర్ చేసే సహజ పద్ధతులు

కెమికల్ హెయిర్ డైలు జుట్టుకు హాని కలిగించి కుదుళ్లను బలహీనపరుస్తాయి. వాటికి బదులుగా సహజమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చు. గోరింటాకు పేస్ట్ జుట్టుకు సహజమైన రంగును, మెరుపును ఇస్తుంది. హెర్బల్ పేస్ట్‌లు జుట్టు బలాన్ని కాపాడుతాయి. దాని సహజ రంగును నిలుపుకోవడంలో సహాయపడతాయి. దీనివల్ల జుట్టు పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

జీవనశైలి మార్పులు

కేవలం విటమిన్ B12 మాత్రమే కాదు.. జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేయాలి. సమతుల్య ఆహారం తీసుకుంటూ.. జుట్టు ఆరోగ్యానికి దోహదపడే ఫుడ్స్ తీసుకోవాలి. రోజూ ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. మంచి నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. దాని సహజ రంగు ఎక్కువ కాలం నిలుస్తుంది.