చర్మ సంరక్షణ కోసం వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టు తిరిగేస్తూ ఉంటారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఉత్పత్తులు గురించి రివ్యూ బాగుంటే కొనేసి వాడేస్తారు. కానీ ఇవన్నీ తాత్కాలిక అందాన్ని మాత్రమే ఇస్తాయి. మీ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోయేలా చేసే పదార్థాలు నిజానికి మీ వంటింట్లోనే ఉన్నాయి. అదేంటో తెలుసా నెయ్యి. భారతీయులు వంటలో ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యంలో ప్రధానంగా వినియోగిస్తారు. బంగారు వర్ణంలో ఉండటమే కాదు మీరు కూడా బంగారంలా మెరిసిపోయేలా చేయగలదు. రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకుంటే చర్మానికి చాలా మేలు జరుగుతుంది.


హైడ్రేషన్


నెయ్యి సహజమైన పదార్థం. అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మాన్ని హైడ్రేట్ గా మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని లోపల నుంచి పోషణ అందిస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచుతాయి.


యాంటీ ఏజింగ్


నెయ్యిలో విటమిన్ ఏ, ఇ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి అకాల వృద్ధాప్యానికి దారి తీస్తాయి. నెయ్యి తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి. ముడతలు లేని చర్మాన్ని అందిస్తాయి.


కొల్లాజెన్


ఇందులో ఉండే ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆకృతిని మెరుగుపరుస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు కొల్లాజెన్ చాలా అవసరం. ఇది చర్మాన్ని ధృడంగా, మృదువుగా ఉంచుతుంది.


గ్లోయింగ్


నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన గ్లో అందిస్తుంది. రెగ్యులర్ గా నెయ్యి తీసుకోవడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని మీరు పొందవచ్చు.


మచ్చలు పోగొడుతుంది


మచ్చలు, చిన్న పాటి చర్మ సమస్యలు ఉంటే నెయ్యి వాటిని పోగొడుతుంది. ఇందులోని కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని నయం చేయడంలో సహాయపడతాయి. చికాకు కలిగించే చర్మం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సున్నితమైన చర్మ పరిస్థితులు ఉన్నవారికి కూడా ఇది అద్భుతమైన ఎంపిక.


చర్మానికి రక్షణ


నెయ్యి సం స్క్రీన్ కు ప్రత్యామ్నాయం కానప్పటికీ ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు యూవీ కిరణాల నష్టం నుంచి చర్మానికి అదనపు రక్షణ అందిస్తాయి. సన్ స్పాట్ లని తగ్గించి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తాయి.


వ్యర్థాలు పోగొడుతుంది


ఆయుర్వేద శాస్త్రం ప్రకారం శరీరంలోని వ్యర్థాలని బయటకి పంపించడంలో నెయ్యి సమర్థవంతంగా పని చేస్తుంది. చర్మానికి మాత్రమే కాదు మొత్తం ఆరోగ్యానికి దోహదపడుతుంది.


అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, పీసీఓడీ సమస్యలతో బాధపడే వాళ్ళు నెయ్యికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. నెయ్యి తినడం వల్ల ఇప్పటికే ఉన్న కొవ్వు శాతం మరింత పెరుగుతుంది. దీని వల్ల ఇతర సమస్యలు వస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: అజీర్తి, పొట్ట సమస్యలు తగ్గించేందుకు ఈ ఒక్క మసాలా చాలు