Immunity Boosting Tips for Rainy Season : వర్షాకాలంలో నిద్ర లేవడం నుంచి రోజును ప్రారంభించడం ఓ యుద్ధంలా ఉంటుంది. రోజూ చేసే పనులే అయినా బద్ధకంగా అనిపిస్తుంది. వాతావరణం చల్లగా ఉండడంతో పాటు.. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి వ్యాధులు ఇబ్బంది పెడుతూ అస్సలు లేవాలి అనేలా చేయవు. యాక్టివ్‌గా లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీంతో ఈజీగా సీజనల్ వ్యాధులు వచ్చేస్తాయి. అందుకే పిల్లల నుంచి పెద్దలవరకు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యమని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ప్రతాప్ చౌహాన్.
ఆయుర్వేదం ప్రకారం.. వర్షాకాలం వాతం ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులతో పాటు.. ఇమ్యూనిటీ సమస్యలు పెరుగుతాయి. జీర్ణశక్తి బలహీనపడుతుంది. దీనివల్ల త్వరగా ఇన్ఫెక్షన్ల భారిన పడతారు. ఈ ఇబ్బందులు పడకూడదనుకుంటే.. ప్రతి రోజూ ఉదయం ఇవి ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. ఇంతకీ మార్నింగ్ ఫాలో అవ్వాల్సిన 5 టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజును ఇలా ప్రారంభించండి
ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి. మీరు అల్లం ముక్క లేదా తేనె, నిమ్మరసం కూడా దానిలో వేసుకోవచ్చు. ఇది మీ జీర్ణశక్తిని (అగ్ని) మేల్కొల్పుతుంది. శరీరంలోని టాక్సిన్స్(అమ)ను తొలగిస్తుంది. మీ జీవక్రియను నెమ్మదిగా పెంచుతుంది. కాలక్రమేణా ఇది పేగు కదలికలను నియంత్రించి.. అంతర్గతంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఆయిల్ పుల్లింగ్
ఒక స్పూన్ కోల్డ్-ప్రెస్డ్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె తీసుకోండి. దానిని నోటిలో వేసుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు నోటిలో తిప్పండి. గండూషం అని పిలువబడే ఈ సాంప్రదాయ నిర్విషీకరణ ఆచారం.. నోటి పరిశుభ్రతను బలపరుస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. నోటిలో సూక్ష్మజీవుల భారాన్ని తగ్గించి రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. పంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
ప్రాణాయామం
మీ శ్వాస తీసుకునే పద్ధతి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనులోమ్ విలోమ్, భ్రమరి వంటి ప్రాణాయామ పద్ధతులు నాడీ వ్యవస్థను సమతుల్యం చేయడానికి, ఆక్సిజనేషన్‌ను మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి వర్షాకాలంలో ప్రతిరోజూ ఉదయం కనీసం 15 గంటలు ప్రాణాయామం చేసేందుకు ట్రై చేయండి.
అభ్యంగ స్నానం
అశ్వగంధ బాలా లేదా చ్యవన్ప్రాశాది తైలా వంటి వెచ్చని ఆయుర్వేద నూనెలను తీసుకుని.. వాటితో శరీరానికి మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శోషరస పారుదలకు మద్దతు ఇస్తుంది. దీనివల్ల శరీరంలో సహజ రక్షణ విధానాలు బలపడతాయి. ముఖ్యంగా కీళ్ల సమస్యలు తగ్గుతాయి. ఈ మసాజ్‌ను తలపై, పాదాలపై కూడా కచ్చితంగా చేయండి. జుట్టు పెరుగుదలకు, స్కిన్ టోన్ మెరుగుపరచడం, ఒత్తిడిని తగ్గించడంలో ఈ మసాజ్‌లు వండర్స్ చేస్తాయి.
అల్పాహారం
వర్షాకాలంలో బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా చేయాలి. ఉదయాన్నే చల్లని మిల్క్‌షేక్‌లు, పచ్చి సలాడ్‌లు తినకపోవడమే మంచిది. దానికి బదులుగా.. కొద్దిగా మసాలా దినుసులతో కూడిన మూంగ్ దాల్ కిచిడి, వేడి వేడి గంజి లేదా బొప్పాయి లేదా ఉడికించిన ఆపిల్ వంటి సీజనల్ పండ్లను తీసుకోండి. వేడిగా ఉండే ఆహారాలు తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. శరీరం పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ రెండూ చాలా అవసరం.
వర్షాకాలంలో ఈ సింపుల్ రొటీన్‌ని అలవాటు చేసుకుంటే కచ్చితంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు.. ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ ఇబ్బంది వచ్చినా.. వాటిని ఎదుర్కొనే సామర్థ్యం శరీరంలో పెరుగుతుంది. కాబట్టి వీటిని డైలీ ఫాలో అయిపోండి.