Kitchen Spices for Immunity : ఆయుర్వేదంలో వంటగదిని మొదటి ఫార్మసీగా చూస్తారు. అవును మనం ప్రతిరోజూ వినియోగించే మసాలా దినుసులు కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తోంది ఆయుర్వేదం. సీజన్ మారుతున్నప్పుడు లేదా ఇమ్యూనిటీ తగ్గిపోతుందనుకున్నప్పుడు వీటిని వినియోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పూర్తి ఆరోగ్యానికి ఇవి మద్ధతునిస్తాయి. అందుకే ఎన్నో శతాబ్ధాలుగా ఈ మసాలా దినుసులను వివిధ సమస్యలకు నివారణ చర్యలుగా ఉపయోగిస్తున్నారని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ప్రతాప్ చౌహన్ తెలిపారు. అలాగే ఏయే మసాల దినుసులతో ఏమేమి సమస్యలు తగ్గించుకోవచ్చో.. వాటిని ఎలా ఉపయోగిస్తే మంచిదో అనే సూచనలు ఇచ్చారు. 

పసుపు

పసుపులోని కర్కుమిన్​ను క్రియాశీల సమ్మేళనం అంటారు. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి దీనిని పాలల్లో, కూరల్లో ఉపయోగించవచ్చు. చిటికెడు పసుపు వేసుకోవడం వల్ల శరీరానికి సహజ రక్షణ అందుతుంది. 

నల్ల మిరియాలు

వీటినే బ్లాక్​ పెప్పర్ అంటారు. ఇవి శ్వాసకోశ మార్గాలను శుభ్రం చేయడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే తేమతో కూడిన వాతావరణంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని వంటల్లో ఉపయోగించడంతో పాటు సూప్స్ వంటివి వాటిలో లేదా పాలతో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది. 

జీలకర్ర

జీలకర్ర జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి.. గట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. అందుకే దీనిని అన్నిరకాల వంటల్లో వినియోగించవచ్చు. లేదంటే స్పూన్ జీలకర్రను నీటిలో మరిగించి టీ గా కూడా తీసుకోవచ్చు. 

అల్లం

అల్లం వికారాన్ని తగ్గించడమే కాకుండా.. రక్త ప్రసరణను పెంచుతుంది. పీరియడ్స్ సమయంలో తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.

ధనియాలు 

ధనియాలు రోజూ మరిగించి తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య కంట్రోల్ అవుతుందని చెప్తారు. అంతేకాకుండా వీటిలో శరీరాన్ని సమతుల్యం చేసే శీతలీకరణ, నిర్విషీకరణ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా వంటల్లో వినియోగించుకోవచ్చు. లేదంటే నీళ్లలో మరిగించి హెర్బల్ టీలా తీసుకోవచ్చు. 

ఆరోగ్యానికై.. 

ఈ మసాలా దినుసులు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు మంచి ఎంపికలు అవుతాయని చెప్తున్నారు జీవ ఆయుర్వేద వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ చౌహాన్. కాబట్టి ఉదయాన్నే అల్లం లేదా పసుపు టీ, సలాడ్లలో, పెరుగులో వేయించిన జీలకర్ర వేసుకోవడం వంటివి చేయవచ్చు. కూరగాయలు ఉడికించేప్పుడు ధనియాలు వంటి హెర్బ్స్ చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి క్రమంగా పెరుగుతుంది. అయితే మంచి ప్రయోజనాలు కోసం రెగ్యులర్​గా వీటిని వినియోగించాలి. అలాగే మెరుగైన జీవనశైలిని ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యానికి లాభాలు చేకూరుతాయని చెప్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.