ఆరోగ్య సమస్యల బారిన పడ్డాక మందులు వాడడం ఎంత ముఖ్యమో, ఆ వ్యాధికి తగ్గట్టు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం కూడా అంతే అవసరం. మయోసైటిస్ బారిన పడిన సమంత కూడా ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే, కఠినమైన ఆహార నియమాలను పాటిస్తోంది. ఆ వ్యాధిని జయించేందుకు అవసరమైన వ్యాయామాలు చేస్తుంది. ఈ వ్యాధిని తట్టుకునేందుకు తాను ఆటోఇమ్యూన్ డైట్ పాటిస్తున్నట్టు తన ఇన్ స్టా ఖాతాలో తెలిపింది. అప్పటినుంచి ఎక్కువమంది ఆటోఇమ్యూన్ డైట్ గురించి వెతకడం ప్రారంభించారు.
సమంత గత ఏడాది తాను ఆటోఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అప్పటినుంచి ఆమె ఆ చికిత్సలో నిమగ్నమైపోయింది. బయట కనిపించడం చాలా వరకు తగ్గిపోయింది. ఆ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు కొన్ని నెలల పాటూ అమెరికా వెళ్లిందని కూడా టాలీవుడ్ టాక్. సమంత మయోసైటీ సమస్య నుంచి బయటపడే వరకు విశ్రమించనని, ఆహారం విషయంలో మన కోరికల్ని ఎలా అదుపు చేసుకోవడం ఎంత ముఖ్యమో, తాను పాటిస్తున్న ఆటో ఇమ్యూన్ డైట్ వల్ల అర్థమైందని తాజాగా ఆమె చేసిన ఇన్ స్టా పోస్టులో చెప్పుకొచ్చింది.ఇంతకీ ఆమె పాటిస్తున్న ఆ డైట్ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
ఆటోఇమ్యూన్ ప్రోటోకాల్ డైట్... ఆటోఇమ్యూన్ వ్యాధులకు గురైన వారు కచ్చితంగా పాటించాల్సిన డైట్. ఈ డైట్ ను పాటించడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్, నొప్పి, నీరసం, అలసట వంటివి ఏవీ రావు. ఈ డైట్లో భాగంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను కచ్చితంగా పక్కన పెట్టాలి. అవి ఏంటంటే గుడ్లు, పాల ఉత్పత్తులు, కాఫీ, చక్కెర, పప్పులు వంటివి. మూడు నెలల పాటు వీటన్నింటిని పూర్తిగా తినడం మానేస్తే ఆ వ్యాధి లక్షణాలు కొంతవరకు తగ్గి, ఆరోగ్యం మెరుగుపడినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత స్వల్ప మోతాదుల్లో వాటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే అవి చేర్చుకున్నాక... ఆరోగ్యాన్ని గమనించుకుంటూ ఉండాలి.
ఈ డైట్లో ఏం తినాలి?
ఈ డైట్లో భాగంగా కచ్చితంగా తినకూడని పదార్థాలు ఉన్నట్టే, కొన్ని కచ్చితంగా తినాల్సిన పదార్థాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే తాజా పండ్లు, తాజా కాయగూరలతో వండిన కూరలు, పులిసిన ఆహార పదార్థాలు, ప్రాసెస్ చేయని తాజా మాంసం, అవకాడో, ఆలివ్, కొబ్బరి నూనెలతో వండిన వంటలు, తేనె, వెనిగర్ వంటివి. అలాగే గ్రీన్ టీ, బ్లాక్ టీ, మటన్ పాయ వంటివి కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఇవన్నీ కూడా జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తాయి. జీర్ణాశయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆటోఇమ్యూన్ వ్యాధులను తగ్గించడంలో సహకరిస్తాయి. అయితే ఈ ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారు ఏ ఆహారాన్ని అయినా మితంగా తినాలి. మోతాదుకు మించి తింటే అవి నెగిటివ్ ఫలితాలని చూపించే అవకాశం ఉంది. కాబట్టి పోషకాహార నిపుణులు చెప్పిన ప్రకారం తినడం ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచచ్చు.
Also read: అది ప్రేమ హార్మోన్ కాదు, ఆ హార్మోన్ లేకున్నా మనం ప్రేమించగలం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.