నోటి నుంచి దుర్వాసన రాకూడదంటే బ్రష్ చేయడం తప్పనిసరి. దానివల్ల మీ నోరు ఫ్రెష్‌గా ఉండటమే నోటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. కానీ బ్రష్ చేసే పద్ధతిలో మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. నూటికి 90% మందికి అసలు సరైన పద్ధతిలో బ్రష్ ఎలా చేయాలో తెలియదని డెంటిస్టులు చెబుతున్నారు. పళ్ళను ఎలా తోమితే ఏం అవసరం ఉంది. ఎలాగో అలాగా బ్రష్ చేస్తున్నాం కదా అని లైట్ తీసుకుంటారు చాలామంది. కానీ సరైన పద్ధతిలో బ్రష్ చేయకపోతే మాత్రం దంతవ్యాధులకు కారణం అవుతుంది. దంత వ్యాధులు ఎంత ప్రమాదకరమైనవి అంటే ఒక్కోసారి వీటిని నెగ్లెక్ట్ చేసినట్లయితే గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు ఈ దంత వ్యాధులు కారణం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే డెంటిస్ట్ సూచించినట్లు సరైన పద్ధతిలో సమయం కేటాయించి బ్రష్ చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. 


అయితే బ్రషింగ్ కోసం సరైన పద్ధతి గురించి చాలా మందికి తెలియదు లేదా టైం లేకపోవడం తెలుసుకోవాలని ప్రయత్నం చేయం. బ్రష్ చేసేటప్పుడు, మనం బ్రష్‌ను దంతాలపై ఎంత గట్టిగా రుద్దితే, మన దంతాలు అంత బాగా శుభ్రపడతాయని మనకు అనిపిస్తుంది. ఈ బ్రషింగ్ పద్ధతి పూర్తిగా తప్పు. ఈ విధంగా బ్రష్ చేయడం వల్ల మీ దంతాలకు చాలా హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు.


⦿ లండన్ చెందిన దంత వైద్య నిపుణుల బృందం. బ్రషింగ్ కు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేసింది. మన దంతాల ఆరోగ్యం కోసం, రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడమే కాకుండా, మన బ్రషింగ్ టెక్నిక్ సరైనదా లేదా అనే దానిపై కూడా శ్రద్ధ వహించాలని చెప్పింది. 


⦿ బ్రష్ చేసేటప్పుడు, టూత్ బ్రష్‌ను 45 డిగ్రీల కోణంలో ఉంచాలని  చిగుళ్ళ కింద బ్రష్‌ను సున్నితంగా కదిలించాలని నివేదికలో పేర్కొన్నారు. ఇంకా బ్రష్ చేసిన వెంటనే నోరంతా కడిగేయడం సరికాదన్నారు. ఎందుకంటే బ్రష్ చేసిన తర్వాత, దంతాలను రక్షించే బాధ్యత కలిగిన ఫ్లోరైడ్‌లు వెంటనే బయటకు వెళ్లిపోతాయంటున్నారు. అందుకే బ్రష్ చేసిన అనంతరం ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు కడగకుండా నోటిని వదిలివేయాలని సూచిస్తున్నారు. 


⦿ ఆహారం తిన్నా లేదా ఏదైనా తాగిన తర్వాత కనీసం ముప్పై నిమిషాల పాటు బ్రష్ చేయకూడదని  వైద్య నిపుణుల బృందం సూచించింది. దీని కారణంగా, దంతాలపై పొర దెబ్బతినే ప్రమాదం ఉందని తేలింది.


⦿ ఆహారం తిన్న తర్వాత తగినన్ని నీళ్లు తాగడం వల్ల దంతాలకు కూడా మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇది కాకుండా, అల్పాహారానికి ముందు బ్రష్ చేయడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.


⦿ చాలా మంది బ్రష్ చేయడానికి ఎక్కువ సమయం గడపడానికి కేటాయించరు. అయితే ఆరోగ్యకరమైన దంతాల కోసం ప్రతి ఒక్కరూ కనీసం రెండు నిమిషాల పాటు బ్రష్ చేయాలని డాక్టర్ క్రోనిన్ చెప్పారు.


⦿ ఇక దంతాలను శుభ్రం చేసుకోవడానికి కావాల్సిన పేస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్లోరైడ్స్ పుష్కలంగా ఉన్నటువంటి పేస్టును వాడినట్లయితే దంతాలపై క్యావిటీలు ఏర్పడే అవకాశం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read : మీరు ప్రకృతి ప్రేమికులా? అయితే దీపావళి ఇలా చేసుకోండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.