Sugar and Oil Warnings on Jalebi and Samosa : సమోసా, జిలేబిలను చాలామంది ఇష్టంగా తింటారు. టీ - బిస్కెట్ కూడా చాలామందికి ఫేవరెట్ స్నాక్. అయితే ఈ చేదు వార్త గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెప్తుంది. అంతేనా.. వీటిని సిగరెట్ జాబితాలోకి చేర్చేసింది. అసలు దీనివెనుక కారణం ఏంటి? జిలేబి, సమోసా తింటే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

రీసెంట్​గా ఆరోగ్యమంత్రిత్వ శాఖ.. సమోసా, జిలేబి వంటి స్నాక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని తెలిపింది. నాగపూర్​ AIIMSతో కలిసి క్యాంపైన్ నిర్వహించింది. సమోసా, జిలేబి వంటి ఫుడ్స్ తినడం వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతోందంటూ షాకింగ్ విషయాలు తెలిపింది. అంతేకాకుండా నాగ్‌పూర్‌లోని సమోసా-జలేబి దుకాణాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. వీటిని బాన్​ అయితే చేయలేదు కానీ.. ఏది తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలిసేలా బోర్డులు పెట్టాలని తెలిపింది.

కేవలం హెచ్చరిక మాత్రమే

ఇది కేవలం హెచ్చరిక మాత్రమేనని గుర్తించాలి. ఎందుకంటే ప్రభుత్వం సమోసా, జిలేబీలను తినొద్దు అనట్లేదు. కానీ మోడరేషన్​లో తక్కువ మోతాదులో తీసుకోవచ్చని చెప్తుంది. పొగాకు, సిగరెట్లను ఉపయోగించడం గురించి హెచ్చరికలు ఎలా ఇస్తారో.. వీటి గురించి కూడా అలాంటి హెచ్చరికలే ఇవ్వాలని సూచించారు. అంటే ఈ ఫుడ్స్ దొరికే ప్రాంతంలో ఆ బోర్డులు కచ్చితంగా ఉండాలి. 

ఊబకాయంపై ప్రభుత్వం 

ఊబకాయం గురించి ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే 2050 నాటికి 40 కోట్లకు పైగా ప్రజలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడతారని అంచనా వేయవచ్చు. అమెరికా తర్వాత మన దేశం ఊబకాయం జాబితాలో రెండవ స్థానంలో ఉంటుంది. అంటే ప్రతి పది మందిలో.. ఊబకాయంతో ఇద్దరు వ్యక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫుడ్స్ జోలికి వెళ్లొద్దంటూ అవగాహన కల్పిస్తున్నారు. 

పోస్టర్లు అతికించాల్సిందే.. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ఎయిమ్స్ నాగ్‌పూర్ సహా అన్ని కేంద్ర సంస్థలకు.. తమ సంస్థల్లో పోస్టర్లు అతికించాలని ఆదేశించింది. ఇది ప్రజలకు రోజువారీ స్నాక్స్‌లో ఎంత కొవ్వు, చక్కెరను ఇస్తుందో.. ఆ బోర్టులో కచ్చితంగా తెలియజేసేలా ఉండాలని సూచించింది. ఇది శరీరానికి హానికరం కాబట్టి ప్రతిరోజూ తినే స్నాక్స్‌లో చక్కెర, నూనె పరిమాణం గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రయత్నం లక్ష్యం.

లడ్డూ, వడా పావ్, పకోడీ వంటి అన్ని స్నాక్స్ పరిశీలిస్తున్నామని ఎయిమ్స్ నాగ్‌పూర్ అధికారులు తెలిపారు. ఈ హెచ్చరిక బోర్డులను త్వరలో క్యాంటీన్లు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆరోగ్య నిపుణులు ఈ స్నాక్స్ ద్వారా తీసుకునే చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ పొగాకులాగే ప్రమాదకరమని భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

రెండుసార్లు ఆలోచించాలట

ప్రభుత్వం ఆహారంపై నిషేధం విధించడం లేదని ఇది ప్రజలకు వారి ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తోందని నిపుణులు చెప్తున్నారు. ఒక్క రసగుల్లాలో 6 స్పూన్ల చక్కెర ఉండవచ్చని తెలిస్తే.. తినడానికి ముందు రెండుసార్లు ఆలోచిస్తారని అలా కంట్రోల్ చేయడమే దీని లక్ష్యం అంటున్నారు. ఊబకాయంతో పాటు మధుమేహం, రక్తపోటు మొదలైన వ్యాధులుకు ఇవే ప్రధానకారణమని చెప్తూ అవగాహన కల్పిస్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.