రోజుకో ఆపిల్ పండు తింటే వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు, కానీ అదే ఆపిల్‌లో ఉండే గింజలు అధికంగా తింటే మాత్రం కచ్చితంగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రావొచ్చని చెప్పాయి చాలా అధ్యయనాలు. ఆపిల్ ఎంత ఆరోగ్యకరమో, వాటిలోని గింజలు మాత్రం అంత ప్రమాదకరం. ఈ విత్తనాలు చాలా విషపూరితమైనవి, ఒక్కోసారి ప్రాణాలు కూడా తీయచ్చు. అలాగని రెండు మూడు గింజలు పొరపాటున తింటే ఏం కాదు. కానీ అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యసమస్యలు తలెత్తడం ఖాయం. 


ఎందుకు ప్రాణాంతకం?
ఆపిల్ గింజల్లో అమిగ్డాలిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ గింజలు పొట్టలోకి చేరిప్పుడు జీర్ణ ఎంజైమ్‌లతో కలిసి సైనైడ్‌ను విడుదల చేస్తాయి. అమిగ్డాలిన్లో సైనైడ్, చక్కెర రెండూ ఉంటాయి. ఇవి రెండూ కలిసి శరీరంలో చేరాక హైడ్రోజన్ సైనైడ్ గా కూడా మారుతాయి. ఈ సైనైడ్ మనిషిని అనారోగ్యానికి గుర్తిచేస్తుంది. అధిక మోతాదులో ఆపిల్ గింజలు శరీరంలో చేరితే సైనైడ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. అప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఆపిల్ గింజలు తినకుండా పడేయమని సూచిస్తారు వైద్యులు. 


నాలుగైదు గింజలు తింటే..
ఒక ఆపిల్ పండు తినడం వల్ల అందులో ఉండే నాలుగైదు గింజలు తినే అవకాశం ఉంటుంది. అది కూడా అనుకోకుండా తింటారు తప్ప, ఎవరూ ఇష్టంగా తినరు. వాటిని తీసిపడేశాకే పండు తినేవారు ఎక్కువ. నాలుగైదు గింజలు తింటే భయపడాల్సిన అవసరం లేదు. వాటి వల్ల ఉత్పత్తి అయ్యే సైనైడ్ శరీరంపై ప్రభావం చూపించలేదు.


ఎన్ని తింటే ప్రమాదం?
మనిషి ప్రాణాలు తీసేంత శక్తి ఆపిల్ గింజలకు ఉంది.  కనీసం 200 గింజలు కలిసి ప్రాణాలు తీయగలవు. అంటే దాదాపు ఒక కప్పు ఆపిల్ గింజలు తింటే ప్రాణాలు తీసేంత సైనైడ్ విడుదల అవుతుంది.అది వెంటనే గుండె, మెదడుపైనే ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు కోమాలోకి వెళతారు. మరణం కూడా సంభవిస్తుంది. అలాగే రోజూ యాపిల్ గింజలు తినడం అలవాటైతే వణుకు, లోబీపీ, శ్వాస సరిగా అందకపోవడం, వికారం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి వీలైనంత మేరకు ఆ గింజలు తినకుండా ఉండడం మంచిది. 


ఒక గ్రాము ఆపిల్ గింజల్లో 0.06 మిల్లీ గ్రాముల నుంచి 0.24 మిల్లీ గ్రాములు సైనైడ్ ఉంటుంది. 


ముఖ్యమైన విషయం ఏంటంటే పొరపాటున యాపిల్ గింజలను నమలకుండా మింగేస్తే ఏ ప్రమాదం ఉండదు. అవి మూత్రవిసర్జనలో బయటికి వచ్చేస్తాయి. నమిలి మింగితేనే సైనైడ్ విడుదల అవుతుంది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: డయాబెటిస్ ఉందా? మీ చూపు పోయే వరకు తెచ్చుకోవద్దు


Also read: పీరియడ్స్‌లో పొట్ట నొప్పి ఎందుకొస్తుంది? వీటిని తింటే ఆ నొప్పి తగ్గే అవకాశం