Bigg Boss Ultimate: తమిళ బిగ్‌బాస్‌కు హోస్ట్ కమల్ షాక్ ఇచ్చారు. డేట్ల సమస్య కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ‘బిగ్ బాస్ అల్టిమేట్’కు హోస్ట్‌గా వ్యవహరించలేకపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయమై బిగ్ బాస్ యాజమాన్యం, స్టార్ విజయ్ టీవీ, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లకు ఇప్పటికే సమాచారం ఇచ్చానని తెలిపారు. వారు కూడా సానుకూలంగా స్పందించి తన అభ్యర్థనను మన్నించారని... అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.


ప్రస్తుతం ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమాలో కమల్ నటిస్తున్నారు. దీనికి నిర్మాత కూడా ఆయనే. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ఉన్నారు. వీరితో పాటు ఇంకా భారీ తారాగణం కూడా ఉండటంతో ఒక్కరోజు షూట్ మిస్సయినా డేట్ల సమస్య ఏర్పడుతుంది. దీంతో సినిమా ఆలస్యం కావడం, నిర్మాణ వ్యయం పెరగడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. దీంతో కమల్ హాసన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 


ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలని మొదట అనుకున్నారు. అయితే షూటింగ్ ఇప్పటికీ జరుగుతున్నందున ఆ సమయానికి విడుదల అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ అల్టిమేట్ 24 గంటల పాటు హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. తెలుగులో 24 గంటల ఓటీటీ వెర్షన్ ‘బిగ్ బాస్ నాన్‌స్టాప్’ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మొదలు కానుంది. బిగ్ బాస్ తర్వాతి సీజన్‌కు హోస్ట్‌గా తిరిగొస్తానని ఇందులో పేర్కొన్నారు.