డుపు నిండా తిండి, కంటి నిండా నిద్రను మించిన సౌఖ్యం మరోటి లేదు ఈ లోకంలో. తిండి ఒకేగానీ.. నిద్రే సరిగ్గా పట్టడం లేదా? ముఖ్యంగా మీ భాగస్వామి పెట్టే గురక మీకు ఇబ్బందిగా మారిందా? అయితే, మీరు కూడా వారిని అర్థం చేసుకోండి. వారు కావాలని గురక పెట్టరు. వారికి తెలియకుండానే అది వస్తుంది. ఆ గురక వల్ల వారికి కూడా సరిగ్గా నిద్ర ఉండదనే విషయం చాలామందికి తెలియదు. 


నిద్ర లోకి జారుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నపుడు నాలుక, నోరు, గొంతు లేదా ముక్కులోని వాయు మార్గాలు కంపించడం వల్ల ఇలా గురక శబ్దం వస్తుంది. నిద్రకు ఉపక్రమించగానే గొంతు, ముక్కు, వాయుమార్గాల పరిసరాల్లోని కండరాలు రిలాక్స్ అవుతాయి. ఫలితంగా అవి వదులుగా మారతాయి. అందువల్ల వాయుమార్గం ఇరుకుగా మారి శబ్ధాలు వస్తాయి.


డాక్టర్ కరణ్ రాజ్ గురక సమస్యకు కొన్ని రకాల వ్యాయామాలు మంచి ఫలితాలిస్తాయని తన సోషల్ మీడియా అకౌంట్  ద్వారా పంచున్నారు. నాలుక, గొంతు కండరాలను టోన్ చేసి బలపరిచే వ్యాయామాల గురించి  వివరిస్తున్నారు.



  • నాలుకను బయటకు లాగి ఐదు సెకండ్ల పాటు పట్టుకోవాలి. ఇలా రెండు నుంచి నాలుగు సార్లు పునరావృతం చెయ్యాలి.

  • ఇదే వ్యాయామాన్ని మరింత బలంగా చెయ్యాలంటే స్పూన్ ను నోటికి అడ్డంగా పెట్టుకొని నాలుకతో గట్టికి తొయ్యాలి. ఇది ఐదు సెకండ్ల చొప్పున రెండు నుంచి నాలుగు సార్లు చెయ్యాలి.

  • నోట్లో నాలుకను ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు కదిలించాలి. ఇలా కదిలిస్తూ నాలుకతో బుగ్గలను నొక్కాలి.

  • బుగ్గల మీద చేతులతో నొక్కి పట్టుకుని నాలుకతో బుగ్గలను బయటికి తోసేందుకు ప్రయత్నించాలి. ఇలా చేస్తున్నపుడు బుగ్గల మీద తేలికపాటి ఒత్తిడి పడుతుంది. ఇది కూడా మూడు నుంచి నాలుగు సార్లు చెయ్యలి.

  • నాలుకతో ముందు దంతాలను నెట్టుతూ మింగేందుకు ప్రయత్నించాలి. మరింత సమర్థవంతంగా చేసేందుకు ఈ ప్రక్రియ చేస్నున్నపుడు తలపైకెత్తి పైకి చూడడం వల్ల గొంతు కండరాలు కూడా స్ట్రెచ్ అవుతాయి. ఇది కూడా మూడు నాలుగు సార్లు రిపీట్ చెయ్యాలి.


ఇలాంటి వ్యాయామాలు నాలుక, గొంతు కండరాలకు బలాన్ని ఇస్తాయి. ఫలితంగా అవి టోన్ చెయ్యబడి నిద్రపోతున్నపుడు అవి రిలాక్సయినా సరే వాయుమార్గాన్ని మూసెయ్యవు. ఫలితంగా గురక శబ్ధం రాదు. బలమైన గొంతు కండరాలు, నాలుక కండరాలు కలిగి ఉండడం వల్ల, హాయిగా నిద్ర పోవడం వల్ల ఉదయాన్నే  తాజాగా మేల్కొనే అవకాశం ఉంటుంది. ఇది రోజంతా చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా జీవన నాణ్యతలో గణనీయమైన మార్పులు గమనించవచ్చు.


గురకెందుకు వస్తుంది?


బరువు ఎక్కువగా ఉండడం, పొగతాగే అలవాటు, పరిమితికి మించి మద్యం తీసుకోవడం వంటివన్నీ కూడా గురకకు కారణం అవుతాయి. గురక పెద్ద ఆరోగ్య సమస్య కాకపోవచ్చు. కానీ గురక వస్తోందంటే మాత్రం ప్రమాదం పొంచి ఉందని గుర్తించాలి. లైఫ్ స్టయిల్ లో కొద్దిపాటి మార్పులు, సరైన వ్యాయామం, బరువు అదుపులో ఉంచుకోవడం, ఆల్కహాల్ పరిమితుల్లో తీసుకోవడం వంటి చిన్నచిన్న జాగ్రత్తలు ప్రశాంతమైన నిద్రకు దోహదం చేస్తాయి. 


Also read: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి



























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.