ఆనంద్ మహీంద్రా, హర్ష గోయెంకా, ప్రవీణ్ కాశ్వన్... ఈ పేర్లు వినగానే చాలా మందికి ఇట్టే గుర్తొచ్చే విషయం వారి ట్వీట్టర్ పోస్టులు. పోస్టుల్లో వైవిధ్యం, సమకాలీక అంశాలు, విభిన్నమైన వారి విశ్లేషణ శైలి కోట్ల మంది ఫాలోవర్స్ ను తెచ్చిపెట్టింది. ఏ విషయాన్ని అయిన తమ పోస్టుల ద్వారా ఇట్టే ఆసక్తికరంగా మార్చడం వారి ప్రత్యేకత. వీరు చేసే ట్వీట్ లు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. తాజా అంశాలపై ట్వీట్లు పెడుతూ ఎంతో మందికి ప్రేరణ కల్గిస్తుంటారు. 






ఆనంద్ మహీంద్రా... మహీంద్రా సంస్థల ఛైర్మన్. వృత్తి పరంగా తీరిక లేకుండా ఉండే ఆయన సమకాలిన అంశాలపై స్పందించే తీరే వేరు. ఆయన ట్వీట్టర్లో యాక్టివ్ గా ఉంటారు. ఆనంద్ మహీంద్రా పెట్టే ప్రతీ ట్వీట్ వైవిధ్యంగా ఉంటుంది. తెలియని విషయాన్ని తెలియజేస్తూనే చురక అంటించేస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లకు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తూ ఉండే మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తాజాగా పెట్టిన ఒక పోస్టు పెట్టారు. వ్యాయామం చేయడానికి బద్ధికించే వారి కోసం ఓ వీడియో పోస్టు చేశారు. తానూ ఈ కేటగిరీకే చెందినవాడిన వాడినని చమత్కరించారు. వ్యాయామం చేయకపోయినా.. ఆ వీడియో చూస్తే చాలని సరదాగా చురకలంటించారు. నిజంగా ఆ వీడియోలో జిమ్నాస్ట్‌లు చేస్తున్న విన్యాసాలు చూస్తూ మనలో కూడా వ్యాయామం చేయాలన్న భావం కలగడం ఖాయమనిపిస్తోంది. 





ఆ మధ్య రూ.9750కే కారు అంటూ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్  చాలా పాపులర్ అయ్యింది. ఈ ట్వీట్ గురించి అనేక మంది స్పందించారు. ఫియట్ కారుకు సంబంధించి పేపర్లో వచ్చిన ఓ ప్రకటనను ఆయన పోస్టుచేశారు. 1963లో వచ్చిన ఓ ప్రకటనను ఆయన తన ఖాతాలో పోస్టుచేశారు. ఆ సమయంలో కారు ధర ఎలాంటి పన్నులు లేకుండా రూ.9750గా ఉండడం ఆశ్చర్యకరమైన అంశమన్నారు. ఈ కారు మోడల్ ఫియట్ 1100ఈ, దీన్ని ప్రీమియర్ ఆటోమొబైల్స్ కంపెనీ ముంబైలో తయారుచేసింది. రెండు పెట్రోల్ ఇంజిన్లతో ఈ కారు పనిచేసేది.


హర్ష గోయెంకా...స్ఫూర్తినిచ్చే సందేశాలు మరెన్నో


హర్ష గోయెంకా ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్‌..ఆయన ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన అభిప్రాయాలను, ఇతరులకు స్ఫూర్తినిచ్చే సందేశాలను సామాజిక మాధ్యమాల అభిమానులతో పంచుకుంటారు. ఆయన చేసిన పోస్టులు ఎన్నో సార్లు వైరల్ అయ్యాయి. ఇటీవల ఆయన పెట్టిన పోస్టు.. భారత్ లో క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదని, భారతీయులు క్రికెట్ ను ఒక మతంగా భావిస్తుంటారని ట్వీట్ చేశారు. ఈ విషయం గుర్తుచేస్తూ ఒక వీడియోను పోస్టు చేశారు. వర్షపు నీటితో ఉన్న మైదానంలో క్రికెట్ ఆడుతున్న వీడియోను ఆయన తన ట్వీ్ట్టర్ ఖాతాలో పెట్టారు. బ్యాట్స్ మెన్ కొట్టిన భారీ షాట్ ను ఫీల్డర్ నీటిలో జారుకుంటూ అద్భుతమైన క్యాచ్ పెట్టారు. ఇలా ఎన్నో విషయాలను తన ఖాతాల్లో పంచుకుంటూ తన ఫాలోవర్స్ కి చైతన్యాన్ని కల్గిస్తూ ఉంటారు. "మిమ్మల్ని ఎవ్వరూ రక్షించరు. మిమ్మల్ని మీరే సేవ్ చేసుకోవాలి. జీవితంలో ఎవ్వరూ మీకు ఏమీ ఇవ్వరు. మీరే వాటిని పొందాలి. మీకు ఏం కావాలనేది మీకు తప్ప ఎవరికీ తెలియదు. అనుకున్నది సాధించకపోతే మీరు మాత్రమే ఓడిపోతారు. అందువల్ల జీవితంలో ఏ విషయంలోనైనా వెనకడుగు వేయకండి. మీ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి" అని హర్ష గోయెంకా ట్విట్టర్ పోస్టుతో చైత్యనం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎన్నో వైవిధ్య పోస్టులతో లక్షల మంది ఫాలోవర్స్ ను ఆయన సంపాదించుకున్నారు. 






అరుదైన చిత్రాలను అందరికీ పంచుతూ...


ప్రవీణ్ కాశ్వన్ ఐఎఫ్ఎస్ అధికారి. అటవీ ప్రాంతంలో ఉండే అద్భుతాలను తన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉంటారు. పర్యావరణ ప్రేమికులను ఆయన పోస్టులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. భారత్ లో ఉండే సుందరమైన అటవీ ప్రాంతాలు, మనిషికి పర్యావరణానికి ఉండే సహజమైన సంబంధాన్ని అందరికీ తెలియజేసేలా ఆయన పోస్టులు పెడుతుంటారు. అటవీ ప్రాంతానికి సంబంధించి సమాచారం, జంతువులు, వృక్షాలు, వాటి జీవనశైలిపై కాశ్వన్ పెట్టే పోస్టుల్లో ఎంతో విలువైన సమాచారం ఉంటుంది.