అలోవెరా(Aleo Vera).. దీన్నే మనం కలబంద అని కూడా పిలుస్తాం. ఆరోగ్యం విషయంలో దీన్ని మనం ఆల్‌రౌండర్ అని పిలవచ్చు. ఈ మొక్క ఇంట్లో ఉంటే వాస్తు దోషాలను కూడా నివారిస్తుందని అంటారు. ఇంటి సంగతి వదిలి ఒంటి సంగతికి వస్తే.. చర్మంపై ఏర్పడే గాయాలను నయం చేయడానికి కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చాలామంది కలబందను బరువు తగ్గేందుకు కూడా వాడేస్తుంటారు. దాని గురించి మనం మరో కథనంలో చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే.. కలబందతో జుట్టు సమస్యలను ఏ విధంగా అరికట్టవచ్చో తెలుసుకుందాం. కలబందను ఉపయోగిస్తే జుట్టుకు జరిగే మేలు గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
చర్మ ఆరోగ్యానికి కలబంద ఎంత మంచిదో తెలిసిందే. కలబంద(Aleo Vera)లో గ్లిసరిన్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడతాయి. అలాగే, జుట్టుకు కూడా ఈ పోషకాలు మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కలబంద అనేక రూపాల్లో లభిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు బాటిళ్లలో పెట్టి మరీ వీటిని అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. అయితే, వాటిని కొనుగోలు చేయమని మీకు సలహా ఇవ్వడం లేదు. మీ ఇంట్లో అలోవెరా మొక్కను ఒక్కటి పెంచుకోండి చాలు. మీకు అవసరమైనప్పుడు ఆ మొక్కలోని ఆకును తుంచి అందులోని జెల్‌ను స్పూన్ లేదా కత్తితో ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత దాన్ని మీరు జుట్టుకు పట్టించి.. కాసేపు వదిలేస్తే చాలు. కుదళ్లలోకి వెళ్లి.. అక్కడ ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తుంది. జుట్టుకు అలోవెరా జెల్(Aleo Vera Gel) రాయడం వల్ల ఈ కింది ప్రయోజనాలు లభిస్తాయి.
చుండ్రు పోవాలంటే..: తలలో ఫంగల్ లేదా బ్యాక్టీరియా పెరుగుదల వల్ల చుండ్రు ఏర్పడుతుంటుంది. సొరియాసిస్ సమస్య ఉన్నా సరే ఫంగల్ చుండ్రు వేదిస్తుంది. సొరియాసిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. సాధారణ చుండ్రు ఉపశమనం కోసం మాత్రం అలోవెరా జెల్‌ను అప్లై చేయండి. దాని వల్ల ఫంగల్ పెరుగుదల తగ్గి, చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.
దురద నుంచి ఉపశమనం: తల బాగా దురద పెడుతున్నా సరే కలబందను ట్రై చేయండి. అలోవెరాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. మీకు తలలో ఎక్కడైతే దురద పెడుతోందో అక్కడ కలబంద జెల్‌ను రాసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత తలను శుభ్రంగా నీటితో కడిగేయండి. ఆ వెంటనే మీకు దురద నుంచి ఉపశమనం కలుగుతుంది.
జుట్టు పెరుగుతుంది: కలబందలోని జిగురు పదార్ధం(జెల్)ను వారంలో కనీసం రెండు రోజులు పూసుకున్నట్లయితే.. మీ జుట్టు కుదుళ్లు పటిష్టంగా ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడతారు. అంతేకాదు, కుదుళ్లు బలంగా ఉండటం వల్ల జుట్టు ఒత్తుగా అందంగా కనిపిస్తుంది. జుట్టు చాలా చక్కగా పెరుగుతుంది. కలబందలోని A, C, E విటమిన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. జుట్టు చిట్లిపోకుండా చేస్తాయి. అలాగే, డ్యామేజ్ అయిన వెంట్రుకలను సైతం రిపేర్ చేస్తాయి.
Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గమనిక: వైద్య నిపుణులు చెప్పిన వివరాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనం వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యంలో చిన్న సమస్య వచ్చినా మీరు డాక్టర్ సలహా, సూచనలు తీసుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
Also Read: ఇలా కిస్ చేస్తే గనేరియా వస్తుందా? ముద్దు ఆరోగ్యానికి మంచిదేనా?