Iron Pan: ఆధునిక కాలంలో నాన్ స్టిక్ కుక్‌వేర్ వాడుకలోకి వచ్చాయి. అవి కనిపించడానికి స్టైలిష్‌గా ఉండడంతో అందరూ వాటినే కొని వండడం మొదలుపెట్టారు. అంతేకాదు అందులో వండితే మాడే సమస్య కూడా ఉండదు.  కాబట్టి నాన్‌స్టిక్ కుక్‌వేర్లు విపరీతంగా ఆదరణ పొందాయి. ఒకప్పుడు మాత్రం మట్టి పాత్రలు, ఇనుప పాత్రలోనే వండేవారు. ఇప్పుడిప్పుడే అవి మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మహిళలు అధికంగా ఎదుర్కొనే సమస్యల్లో రక్తహీనత ఒకటి. ఒకప్పుడు మహిళలకు రక్తహీనత సమస్య పెద్దగా లేదు. దానికి కారణం ఇనుప కళాయిల్లో వండుకొని తినడమే అంటారు చరిత్రకారులు. అందుకే ఇప్పుడు కూడా ఇనుపకళాయిల్లో వండుకొని తింటే రక్తహీనత సమస్య రాదని చెబుతున్నారు. నాన్‌స్టిక్ కుక్‌వేర్ పక్కనపెట్టి ఇనుప కళాయిలను మట్టి పాత్రలను వాడమని వివరిస్తున్నారు.


రక్తహీనత సమస్య వచ్చిందంటే శారీరకంగా త్వరగా అలసిపోతారు. విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. మానసికంగానూ కుంగిపోతారు. జుట్టు చిట్లి పోతుంది. రక్తహీనత సమస్య కేవలం మహిళల్లోనే కాదు పిల్లల్లో కూడా ఉంటుంది. చాలామంది పిల్లలకు పదేళ్లు నిండకముందే జుట్టు నెరిసిపోతుంది. మహిళల్లో సంతాన లేమి,  థైరాయిడ్, పిసిఒఎస్, గర్భస్రావాలు కావడం, హార్మోన్లు అసమతుల్యత రావడం వంటివి వస్తూ ఉంటాయి. వీటన్నింటికీ ఒకటే కారణం శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందకపోవడమే. అలాంటి పోషకాలలో ఐరన్ కూడా ఒకటి. శరీరంలో రక్తం తగ్గితే అవయవాలకు ఆక్సిజన్ పోషకాలు అందడం తగ్గుతుంది. అందుకే ఇనుము లోపం రాకుండా చూసుకోవాలి. ఇనుము పుష్కలంగా అందితే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల రక్తం ఉత్పత్తి అధికమవుతుంది.


ఒకప్పుడు ఐరన్ పాత్రలోనే వండుకునేవారు. అలా వండడం వల్ల ఆహారానికి ఐరన్ జత అయ్యేదని దీనివల్ల ఐరన్ లోపం వచ్చేది కాదని అంటారు. అందుకే ఇప్పుడు కూడా ఐరన్ పాత్రలోనే మహిళలను వండుకొని తినమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఐరన్ పాత్రలోనే వండుకొని తింటే అది మరింత పోషకాహారంగా మారుతుందని, మానసికంగా, శారీరకంగా వచ్చే అనారోగ్యాలను అడ్డుకుంటుందని చెబుతున్నారు. రక్తహీనత సమస్య ఉంటే తీపి తినాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. అలా తీపి తిని బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువే. ఇనుప పాత్రలో వండిన వంటకాలు తింటే తీపి తినాలన్న కోరిక తగ్గుతుంది.


ఇనుప పాత్రల్లో వండేటప్పుడు చిన్న మంటపైన వండుకోవాలి. అధికమంటపై వండితే పోషకాలు నశించే అవకాశం ఉంది. వంటలు పూర్తయ్యాక శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తడి ఉంటే అవి త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంది. తుప్పు పట్టకుండా ఉండాలంటే తడి ఆరిపోయాక కాస్త నూనె రాసి పెడితే మంచిది.



Also read: పెళ్లయ్యాక నా భర్త ‘గే’ అని తెలిసింది, ఏం చేయమంటారు?


Also read: వేసవిలో చలువ చేసే చలిమిడి, పిల్లలకు రుచిగా చేసి ఇవ్వండి















































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.