కొందరు ఆనందం కోసం రోజూ మందు తాగుతారు. మరికొందరు పని ఒత్తిడి అని ఏదో ఒక కారణం చెప్పి తాగుతూనే ఉంటారు. నిద్ర పట్టడం కోసం ఇంకొంతమంది మందు కొట్టేస్తారు. అయితే ఇలా మితంగా లేదా అధికంగా మద్యపానం చేసిన వారిలో స్ట్రోక్ పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం శరీరంలో సైలెంట్ కిల్లర్ గా మారి ఒక్కసారిగా దాని ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. జపాన్‌కు చెందిన పరిశోధకులు 20, 30 ఏళ్ల వయస్సు వారిలో మితంగా నుంచి అధికంగా మద్యం తాగుతున్న వారి మీద పరిశోధనలు చేశారు. వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ వైద్యులు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నారు.


అధ్యయనంలో ఏం తేలింది?


అధ్యయనంలో పాల్గొన్న వారిని వారానికి ఎన్ని రోజులు, ఎంత మొత్తంలో మద్యం సేవిస్తున్నారని అడిగారు. రోజుకు 443.6 ఏంఎల్(15 ఔన్సు) తాగుతున్నట్టు చెప్పారు. ఈ అధ్యయనంలో సుమారు 1.5 మిలియన్ల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. వారిలో 3,153 మంది స్ట్రోక్ ప్రమాదాన్ని గుర్తించారు. తక్కువ మద్యపానం లేదా అసలు మద్యం సేవించని వారి కంటే ఎక్కువగా తాగే వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉందని వైద్యులు వెల్లడించారు.


పెద్దలు వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ ఆల్కాహాల్ తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది దాదాపు ఆరు మీడియం గ్లాసుల వైన్(175 ఏంఎల్) కి సమానం. ఆల్కహాల్ వినియోగం పెరిగే కొద్ది స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతూ ఉంటుంది. రెండేళ్లుగా మద్యం సేవించిన వారికి 19 శాతం, మూడేళ్లుగా తాగేవారిలో 22 శాతం ప్రమాదం పెరిగిపోతుంది.


అధిక రక్తపోటు, ధూమపానం, బాడీ మాస్ ఇండెక్స్ వంటి ఇతర కారకాలని పరిగణలోకి తీసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రాణాంతక స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. 4 సంవత్సరాల పాటు మద్యపానం సేవించే వారిలో స్ట్రోక్ రేటు ఎక్కువగా ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా యువకులలో స్ట్రోక్ రేటు పెరుగుతోందని, మరణానికి కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువకుల్లో స్ట్రోక్ నియంత్రించాలంటే ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడమే మార్గం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది వారి ఆరోగ్యంపై అలాగే జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. స్ట్రోక్ రాకుండా 90 శాతం వరకు మార్చవచ్చని చెబుతున్నారు.


మద్యపానం వల్ల వచ్చే నష్టాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని నిపుణులు పేర్కొన్నారు. ఆల్కహాల్ వల్ల వచ్చే మానసిక సమస్యలకి ఎటువంటి చికిత్స లేదు. ఇది అనేక అనారోగ్యాలకి కారణం అవుతుంది. ఆల్కహాల్ వల్ల మానసిక రుగ్మత, స్లీపింగ్ డిజార్డర్, డిప్రెసివ్ డిజార్డర్, యాంగ్జయిటీ వంటివి కలుగుతాయి. మద్యం వల్ల లాభాలు లేకపోగా అన్నీ నష్టాలే ఉంటాయి. గుండె, కాలేయం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అంటారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: అతిగా వేరుశెనగ తింటున్నారా? తీవ్రమైన ఈ దుష్ప్రభావాలు తప్పవు