AI Tools and the Human Brain : నేటి యువత AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై ఎక్కువగా ఆధారపడుతుంది. ఆఫీస్ వర్క్స్ నుంచి.. ఆరోగ్య సమస్యల వరకు, ఎమోషనల్ సపోర్ట్ కోసం కూడా చాలామంది AIని ఆశ్రయిస్తున్నారు. అలాగే AI అనేది మనల్ని మనం అప్డేట్ చేసుకోవాల్సిన ఒక సాధారణ ప్రక్రియగా మారిపోయింది. దీంతో ప్రతి చిన్న విషయాన్ని కూడా దానితో చర్చించే అలవాటు చాలామందిలో పెరిగిపోయింది.
ఒక సర్వే ప్రకారం చాలామంది తమ ఒంటరితనాన్ని అధిగమించడానికి కూడా AIని ఉపయోగిస్తున్నారట. పరీక్షల సమయంలో, చిన్న చిన్న వ్యాధులకు చికిత్స కోసం, ఆఫీసు పని కోసం ఇలా ప్రతిదానికీ ప్రజలు AIని ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని పనులకు AI చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ.. అలా చేయడం వల్ల కూడా ప్రమాదం ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. దీనికి అనేక కారణాలను అందిస్తున్నారు.
స్టడీలో భాగంగా ఏమి చేశారంటే..
AI సాధనాలను ఉపయోగించే వ్యక్తుల మెదడుపై ఆలోచనా శక్తి, పని శక్తి ఎక్కువగా ప్రభావితమవుతుందని అనేక పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు నిరూపించారు. ఒక అధ్యయనంలో 54 మంది స్వచ్ఛంద సేవకుల బృందంపై స్టడీ చేశారు. వీరిలో ఎక్కువ మంది 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఒక వ్యాసం రాసే పనిని అప్పగించారు. ఈ 54 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. వారిలో ఒక గ్రూపును Chatgptని ఉపయోగించమని, రెండవ గ్రూపును Google AIని ఉపయోగించమని, మూడవ గ్రూపును స్వయంగా వ్యాసం రాయమని టాస్క్ ఇచ్చారు. ఈ సమయంలో శాస్త్రవేత్తలు EEG హెడ్‌సెట్‌ని ఉపయోగించి వారి మెదడు కార్యకలాపాలను ట్రాక్ చేశారు.
అధ్యయనంలో షాకింగ్ విషయాలు
అయితే ఆ సమయంలో శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనుగొన్నారు. ఉపాధ్యాయులు తమ వ్యాసాలను రాస్తున్నప్పుడు.. వారి చేతిరాతలో లోతు, భావోద్వేగం లేదని కనుగొన్నారు. ఇంకా ChatGPTని ఉపయోగించిన వారిలో మెదడు కార్యకలాపాలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. Googleని ఉపయోగించి రాసిన వారి మెదడు కార్యకలాపాలు అలా చేయని వారి కంటే ఎక్కువగా కనిపించాయట. మిగిలిన వారు తమ వ్యాసాలలో పెద్ద డెప్త్ లేదని గమనించారు. మరోవైపు తమ సొంత మనస్సు నుంచి వ్యాసాలు రాసిన వారు తమ వ్యాసాలతో ఎక్కువగా అనుసంధానమైనట్లు భావించారు. ఇంకా వాటిని రాసిన వారిలో మానసిక కార్యకలాపాలు అత్యధికంగా, ఉత్తమంగా ఉన్నట్లు గుర్తించారు.
AI సాధనాలపై తక్కువ ఆధారపడితే మంచిదట
పరిశోధన ప్రకారం.. ఈ AI సాధనాలపై ఎక్కువగా ఆధారపడిన వ్యక్తుల మెదడుల్లో చురుకుదనం చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే వారి జ్ఞాపకశక్తి కూడా గణనీయంగా క్షీణించిందట. మెదడు పెరిగే ప్రారంభ సంవత్సరాల్లో ఈ సాధనాలను ఉపయోగించే వ్యక్తులపై గణనీయమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. అందువల్ల AI సాధనాలను పరిమితంగా ఉపయోగించాలని అంటున్నారు. లేకుంటే మెదడు పూర్తిగా దాని సామర్థ్యాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.