AdFalciVax Vaccine for Malaria : ఇండియా మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడటానికి ఒక పెద్ద అడుగు ముందుకు వేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భువనేశ్వర్​లోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (RMRCBB), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR)లతో కలిసి బయోటెక్నాలజీ విభాగం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ (DBT-NII) సహకారంతో కొత్త మలేరియా వ్యాక్సిన్​ను తయారు చేసింది. దీనికి AdFalciVax అని పేరు పెట్టారు. ఇది భారతదేశపు మొట్టమొదటి వ్యాక్సిన్. ఇది మలేరియాకు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిపారమ్​ను రెండు వేర్వేరు స్థాయిలలో లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది ప్రజలను మలేరియా నుంచి రక్షించడమే కాకుండా.. దోమల ద్వారా వ్యాప్తి చెందకుండా కూడా నిరోధిస్తుంది.

AdFalciVax అంటే ఏమిటి?

AdFalciVax అనేది ఒక ప్రత్యేకమైన వ్యాక్సిన్. ఇది మలేరియా పరాన్నజీవి రెండు ముఖ్యమైన దశలపై దాడి చేస్తుంది. మొదటి దశలో పరాన్నజీవి మానవ శరీరంలో ఇన్ఫెక్షన్​ను వ్యాపింపజేసింది. రెండవ దశలో దోమల ద్వారా ఈ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొకరికి చేరుతుంది. ఈ వ్యాక్సిన్ మిమ్మల్ని అనారోగ్యం నుంచి రక్షించడమే కాకుండా.. మలేరియా వ్యాప్తి చెందకుండా కూడా నిరోధిస్తుంది. జంతువులపై చేసిన ప్రారంభ పరీక్షలలో.. ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత వ్యాక్సిన్లైన RTS, S/AS01, R21/Matrix-M కంటే అనేక విధాలుగా ఇది మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు.

బ్యాక్టీరియా నుంచి వ్యాక్సిన్

ఈ వ్యాక్సిన్ తయారీలో 'లాక్టోకోకస్ లాక్టిస్' అనే సురక్షితమైన బ్యాక్టీరియాను ఉపయోగించారు. ఇది రెండు వేర్వేరు దశలకు వ్యతిరేకంగా ప్రభావవంతమైన అంశాలను కలిపి.. ఒక బలమైన వ్యాక్సిన్​ను తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ గది ఉష్ణోగ్రత వద్ద 9 నెలల వరకు చెడిపోదు. ఇది విద్యుత్ లేదా చల్లని ప్రదేశం లేని ప్రాంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని సురక్షితమైన పదార్థాలతో తయారు చేశారు.

ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏంటి?

AdFalciVax అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. ఇది మలేరియా పరాన్నజీవిని రెండు రకాలుగా దూరం చేస్తుంది. సాధారణంగా ఇతర వ్యాక్సిన్లు ఒకే దశను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి. కాని ఇది రెండు దశల్లో పనిచేస్తుంది. ఇది వ్యక్తికి మలేరియా వచ్చే ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా.. దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా హెల్ప్ చేస్తుంది. అదే సమయంలో ఈ వ్యాక్సిన్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. AdFalciVax ఇంకా ప్రారంభ అభివృద్ధి దశలో ఉంది. ఇది ప్రజలకు చేరడానికి కొంత సమయం పడుతుంది.

ICMR ప్రకారం.. వ్యాక్సిన్ అభివృద్ధి, పరీక్ష ప్రణాళిక ఈ విధంగా ఉంది.

  • GMP ఉత్పత్తి, టాక్సిసిటీ పరీక్ష: దీనికి దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది.
  • ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్: ప్రారంభ మానవ పరీక్ష కోసం మరో 2 సంవత్సరాలు అవసరం.
  • ఫేజ్ 2b, ఫేజ్ 3 ట్రయల్స్: పెద్ద ఎత్తున పరీక్ష కోసం 2.5 సంవత్సరాల సమయం.
  • అనుమతి, మార్కెటింగ్ లైసెన్స్: దీనికి మరో 6 నెలలు అవసరం.

ఏవైనా ఆలస్యం జరిగితే పనిని పూర్తి చేయడానికి ప్రతి దశలో అదనంగా 6 నెలల సమయం కూడా తీసుకుంటారు. మొత్తంమీద అంతా బాగానే ఉంటే.. ఈ వ్యాక్సిన్ దాదాపు 7 సంవత్సరాలలో ప్రజలకు చేరుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.