చల్లగా చినుకులు పడుతుంటే వేడి వేడిగా ఒక కప్పు టీ తాగకుండా ఎవరు ఉంటారు. సాయంత్రం వేళ కుటుంబంతో కలిసి టీ తాగితే హాయిగా అనిపిస్తుంది. అయితే అది సాధారణమైన పాలతో చేసిన టీ కాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే మూలికలతో చేసినది అయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే టీ తాగారనే సంతృప్తి పొందుతారు. వీటితో తయారు చేసిన టీ మాన్ సూన్ సీజన్ లో వచ్చే అనారోగ్యాలను కూడా దరి చేరకుండా చేస్తుంది. ఈ టైమ్ లో ఎక్కువగా ఫ్లూ, ఇన్ఫెక్షన్స్, నీటిలో ఉండే వ్యాధికారకాల వల్ల అలర్జీలు వాప్తి ఉంటుంది. అందుకే వీటి నుంచి బయట పడి రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు, కాలానుగుణ వ్యాధులని ఎదుర్కోవడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి.


పసుపు


పసుపులో ఉండే కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. సాధారణ గ్రీన్ టీలో ఒక చిటికెడు పసుపు లేదా సుగంధ ద్రవ్యాలు, మసాలా ఛాయ్ మిశ్రమాలు జోడించడం వల్ల శ్వాసకోశంలో మంటని తగ్గిస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలని నియంత్రిస్తుంది. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.


నల్ల మిరియాలు


నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. పసుపు టీకి చిటికెడు నల్ల మిరియాల పొడి జోడిస్తే మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. అది మాత్రమే కాదు పాలలో మిరియాల పొడి వేసుకుని తాగడం వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


దాల్చిన చెక్క


సాధారణ టీలో దాల్చిన చెక్కని జోడించడం లేదంటే గ్రీన్ టీని దాల్చిన చెక్కతో తయారు చేసుకుని తాగొచ్చు. జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పిని నయం చేయడంలో సహాయపడుతుంది. మొత్తం ఆరోగ్యానికి దోహదపడే యాంటీ ఆక్సిడెంట్లు సమకూరుస్తుంది. మధుమేహులు కూడా దాల్చిన చెక్క టీ తీసుకుంటే చాలా మంచిది.


అల్లం


మాన్ సూన్ సీజన్ లో రోగాలని దూరం పెట్టాలంటే ప్రతీ ఒక్కరి ఇళ్లలో పసుపు, అల్లం తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇవి రెండూ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలని కలిగి ఉంటాయి. రెగ్యులర్ బ్లాక్ టీ, మిల్క్ బేస్డ్ మసాలా ఛాయ్ లేదా గ్రీన్ టీకి తురిమిన అల్లం జోడించి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూని తగ్గిస్తుంది. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు దీనికి కారణం. శ్వాసకోశ సమస్యల్ని తగ్గిస్తుంది. నాసికా రద్దీని నయం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత అల్లం టీ సిప్ చేయడం వల్ల జీవక్రియ, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.


తులసి


పవిత్రమైన తులసి గొప్ప ఔషధ లక్షణాలు కలిగిన మొక్క. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఆడాప్టోజెనిక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. జలుబు, దగ్గు, ఫ్లూని నయం చేస్తుంది. టీ తయారు చేసుకునేతప్పుడు తాజా తులసి ఆకులు జోడించుకోవచ్చు. లేదంటే వేడి నీటిలో తులసి ఆకులు నానబెట్టుకుని తాగినా సరే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఈ యాప్ బ్రెయిన్ స్ట్రోక్‌ను ముందే పసిగట్టి అలర్ట్ చేస్తుందట!