శరీరంలో అధికంగా వేడి చేసినప్పుడు నోట్లో పుండ్లు, పూత వస్తూనే ఉంటాయి. ఓ యువతికి కూడా అలాగే నాలుక మీద పుండ్లు వచ్చాయి. సాధారణమైనవే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాటి బాధ ఎక్కువ అవడంతో డెంటిస్ట్ దగ్గరకి వెళ్ళింది. జ్ఞాన దంతాల వల్ల అలా వచ్చిందని అని మందులు ఇచ్చారు. అవి వాడినా కూడా తగ్గలేదు. చివరికి పరీక్షలు చేయిస్తే క్యాన్సర్ అని తేలింది. ఫలితంగా నాలుక సగం తీసివేయాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే..
ఛార్లెట్ వెబ్ స్టర్ సాల్టర్ అనే 27 ఏళ్ల యువతి ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేస్తుంది. 2018 లో తన నాలుకపై తొలిసారిగా పుండ్లు కనిపించాయి. అవి బాగా ఇబ్బంది పెట్టడం వల్ల దంత వైద్యుడిని సంప్రదించింది. జ్ఞాన దంతాలు బయటకి రావడం వల్ల అలా ఇబ్బంది కలుగుతుందని డాక్టర్ చెప్పేసరికి వైద్యుని సలహా మేరకి దంతాలు క్లీన్ చేయించుకుంది. రెండేళ్ల తర్వాత మళ్ళీ అదే ప్రదేశంలో పుండ్లు వచ్చాయి. హ్యాంగోవర్, స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఇలా అవుతుందని అనుకుని పట్టించుకోకుండా ఉండిపోయింది. కానీ వాటి వల్ల ఆమె నాలుక తెల్లగా మారిపోయి గాయాలు ఎక్కువ అయ్యాయి. చివరికి ఆమె 2021లో చెవి, ముక్కు, గొంతు డాక్టర్ ని సంప్రదించింది. ఇంగ్లాండ్ లోని చిచెస్టర్ సెయింట్ రిచర్డ్స్ హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడి వైద్యులు ఆమె నాలుకపై కణితిని గుర్తించారు.
ఆమె నాలుకకి పొలుసుల కణ క్యాన్సర్ సోకిందని వెల్లడైంది. ఇది నెమ్మదిగా నోరు, గొంతులోనూ ప్రభావం చూపిస్తుందని డాక్టర్స్ చెప్పారు. సాధారణంగా ఇటువంటి క్యాన్సర్ ధూమపానం ఎక్కువగా చేసే వారిలో కనిపిస్తుంది. కానీ ఆమెకి ఆ అలవాటు లేకపోయినా ఈ క్యాన్సర్ బారిన పడటం వైద్యులని ఆశ్చర్యపరిచింది. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఆమె నాలుకకి శస్త్ర చికిత్స చేశారు. సుమారు తొమ్మిది గంటల పాటు శ్రమించి నాలుకలో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. తన తొడ నుంచి కొద్దిగా కండని తీసి ఆమె నాలుకకి సాధారణ రూపం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
ఆపరేషన్ జరిగిన తర్వాత రెండు వారాల పాటు ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత తన కొత్త నాలుకతో ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి అనే దాని గురించి వైద్యులు ఆమెకి ప్రత్యేకంగా ఫిజియో థెరపీ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఆమె కోలుకుని చిన్నగా మాట్లాడటం ప్రారంభించింది. ఆ క్యాన్సర్ కణాలు ఇతర భాగాలకి వ్యాపించాయో లేదో అని తెలుసుకోవడానికి డాక్టర్స్ పరీక్షలు కూడా చేశారు. కానీ వాటిలో ఆమెకి క్యాన్సర్ లేదని నిర్ధారణ అయ్యింది.
నాలుక క్యాన్సర్ లక్షణాలు
☀ నాలుకపై ఎరుపు లేదా తెల్లటి ప్యాచ్ కనిపించడం
☀ నాలుకపై పుండ్లు
☀ మింగేటప్పుడు నొప్పి
☀ నాలుకపై నొప్పి లేదా మంట
☀ మాట్లాడటంలో ఇబ్బంది, నాలుక కదిలించడం కష్టం అవడం
☀ నాలుక నుంచి రక్తస్రావం
ఈ సంకేతాలు కనిపిస్తే ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యం చేస్తే నాలుక తీసేయడం వల్ల మాట పోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: మందు తాగితే మెదడు మటాషే, ఇవిగో ఆధారాలు