తలనొప్పి అనేది ఒక సాధారణమైన విషయం. నిద్ర సరిగా పట్టకపోయినా, తీవ్రంగా అలసిపోయినా, ఎక్కువగా ఆలోచించినా కూడా తలనొప్పి వస్తుంది. అయితే సాధారణ తలనొప్పి కాసేపటికి తగ్గిపోతుంది. కానీ హఠాత్తుగా తీవ్రమైన తలనొప్పి వచ్చి, అది తరచూ వస్తు పోతూ ఉంటే మాత్రం తేలికగా తీసుకోకండి. అది మెదడు స్ట్రోక్  రావడానికి ముందు కనిపించే ముందస్తు లక్షణం కావచ్చు. స్ట్రోక్ అనేది ఒక ప్రాణాంతకమైన అత్యవసర పరిస్థితి. ఇది మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు సంభవిస్తుంది. మెదడులో రక్తం గడ్డ కట్టడం, మెదడుకు రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. హైబీపీ అనేది మెదడు స్ట్రోక్‌కు ప్రధాన కారణం. అందుకే హై బీపీ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీపీ పెరగకుండా చూసుకోవాలి.


స్ట్రోక్ ఎన్ని రకాలు?
బ్రెయిన్ స్ట్రోక్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, రెండోది హేమరేజిక్ స్ట్రోక్.  రక్తం గడ్డ కట్టడం వల్ల మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి ఇస్కిమిక్స్ స్ట్రోక్ వస్తుంది. రక్తనాళం పగిలిపోవడంవల్ల హేమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. ఈ రెండింటిలో అధికంగా వచ్చేవి ఇస్కిమిక్ స్ట్రోకే. 


తలనొప్పి వస్తే...
ఈ రెండు రకాల స్ట్రోకుల్లోనూ తలనొప్పి ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం కరోటిడ్ ధమని నుండి స్ట్రోక్ ప్రారంభం అవుతుంది. ఈ ధమని మెదడుకు రక్త ప్రవాహాన్ని అందించే మెడ ప్రాంతంలో ఉంటుంది. ఈ ధమని నుదుటి భాగంలో తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుంది. అమెరికాలోని ప్రీమియర్ న్యూరాలజీ సెంటర్ చెబుతున్న ప్రకారం ముందు 65% మంది బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడే రోగులు ఈ తలనొప్పిని అనుభవించే అవకాశం ఉంది. స్ట్రోక్‌కు ముందు వచ్చే తలనొప్పిని ఎలా కనిపెట్టాలి? అనుకుంటున్నారా, దీనికి ఆరోగ్య నిపుణులు చెబుతున్నది ఇదే... ఈ తలనొప్పి సెకన్లలో తీవ్రమైనదిగా మారిపోతుంది. ఒక కన్ను లేదా రెండు కళ్ళూ స్పర్శను కోల్పోవడం, అలాగే కానీ కంటి చూపును కోల్పోవడం జరుగుతుంది. ఈ తలనొప్పి ఉన్నంతకాలం వారికి ఏది కనిపించదు. కొన్ని సెకన్లు లేదా నిమిషాల పాటు ఈ పరిస్థితి ఉండి, మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. ఇలా ఒక్కసారి జరిగిన కూడా వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా మంచిది. 


ఇతర లక్షణాలు
తలనొప్పితోపాటు స్ట్రోక్ రావడానికి ముందు కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. 
1. ముఖం ఒక వైపుకు లాగేస్తుంది.
2. ఒక కన్నుకు చెందిన కనురెప్ప కిందకు పడిపోయి ఉంటుంది.
3. స్ట్రోక్ వచ్చేముందు రెండు చేతులను పైకి ఎత్తడం కష్టంగా ఉంటుంది.
4. ఒక్కోసారి ఒక చేయి బలహీనంగా, తిమ్మిరిగా అనిపిస్తుంది. 
5. వారు ఏం మాట్లాడుతున్నారో ఎదుటివారికి అర్థం కాదు. మాటలు అస్పష్టంగా, గజిబిజిగా ఉంటాయి. అలాగే ఇతరులు వారితో ఏమి చెబుతున్నారో కూడా అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడతారు.
 ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకండి. ప్రాణానికి ప్రమాదకరంగా మారొచ్చు. 


Also read: మటన్ రోస్ట్ ఇలా చేశారంటే ఒక్క ముక్క కూడా మిగలదు








































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.