Social Isolation Symptoms : కొందరికి మధ్యరాత్రిలో స్వీట్స్ తినాలని అనిపిస్తుంది. ఆ సమయంలో వారు చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్ ఇలా ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. దానిని తినడమో.. లేక బయటకు వెళ్లి ఆస్వాదించడమో.. ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోవడమో చేస్తారు. ఇదే కాకుండా చాలా ఎక్కువగా స్వీట్ క్రేవింగ్స్తో ఉంటారు. నాకు స్వీట్ టూత్ ఉంది అందుకే నేను స్వీట్స్ తింటున్నా అని అనుకుంటున్నారేమో. కొందరిలో ఇది ఓ కారణమేమో కానీ.. రాత్రి సమయంలో స్వీట్స్ తినడానికి మాత్రం ఓ ప్రత్యేకమైన కారణముంది. అదే ఒంటరితనం.
స్వీట్స్ పట్ల విపరీతమైన కోరికలు పెంచేస్తుంది..
అవును ఒంటరితనం వల్లనే చాలామందిలో అర్థరాత్రి చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు తినాలనే కోరికలు పెరుగుతాయట. ఈ విషయాన్ని తాజా అధ్యనం తెలిపింది. చక్కెర పదార్థాలు ఎక్కువగా తినడానికి ఒంటరితనమే కారణమని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన విషయాలను JAMA నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ స్టడీ ప్రకారం ఒంటరితనం వల్ల స్వీట్స్ పట్ల విపరీతమైన కోరికలు కలుగుతాయని దానిలో పేర్కొన్నారు.
అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు
ఈ అధ్యయనం నిర్వహించడానికి పరిశోధకులు సామాజికంగా ఒంటరిగా ఉన్న వ్యక్తులపై పరిశోధన చేశారు. వారి మెదడు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంతోపాటు శారీరక ఆరోగ్యంపై పరిశోధనలు చేశారు. ఒంటరిగా ఉండేవారిలో బరువు పెరగడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. ఇవన్నీ ఒంటరితనం వల్లనే కలుగుతున్నాయని తేల్చారు. శారీరకంగా, మానసికంగా ఒంటరితనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
మానసిక ఆరోగ్య సమస్యలు కూడా..
లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఈ స్టడీ చేశారు. అయితే ఫ్యామిలీతో ఉండేవారిలో ఈ సమస్యలు చాలా తక్కువ శాతం ఉన్నాయని తెలిపారు. ఒంటరిగా ఉండేవారిలో మాత్రం స్థూలకాయం, నిరాశ, ఆందోళన పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇవి పెరగడానికి స్వీట్ క్రేవింగ్స్ కూడా ఓ ప్రధాన కారణమవుతుందని తెలిపారు. ఒంటరిగా ఉన్నప్పుడు స్వీట్స్ మీద దృష్టి ఎక్కువగా మళ్లుతుందని.. దానివల్ల స్థూలకాయం, మధుమేహం, అతిగా తినడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు.
ఆహారంపై నియంత్రణ కోల్పోవడం..
ఈ అధ్యయనంలో 93 మంది ప్రీమెనోపౌసల్ పార్టిసిపెంట్లు పాల్గొన్నారు. ఒంటరితనం అనుభవిస్తున్నవారిలో అధిక శరీర కొవ్వు ఉందని తెలిపారు. ఆహారం ఎక్కువగా తినడం, అనియంత్రిత ఆహారం వంటి ఇబ్బందులు కూడా వారిని ఎఫెక్ట్ చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఒంటరితనం అనేది స్వీట్స్ క్రేవింగ్స్ పెంచి.. అది పూర్తి ఆరోగ్యాన్నే శారీరకంగా, మానసికంగా నాశనం చేస్తుందని తెలిపారు.
Also Read : హెపటైటిస్ HIV కంటే డేంజర్ అట.. ఇండియాలో ఏటా రెండు లక్షలమందిని ప్రభావితం చేస్తోన్న వైరస్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.