Cancer with Fairness Creams : మెరిసే చర్మం, ఫెయిర్‌గా కనిపించేందుకు చాలామంది స్కిన్ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు ఉపయోగిస్తారు. ఇవి రాసుకుంటే తెల్లగా కనిపిస్తారంటూ.. మీ స్కిన్ బ్రైట్‌గా అవుతుందంటూ.. హెల్తీ స్కిన్ మీ సొంతమవుతుందంటూ కంపెనీలు కూడా ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను ప్రమోట్ చేస్తున్నాయి. అయితే వారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి చూస్తున్నారు తప్పా.. స్కిన్‌కు హానీ చేయని కెమికల్స్ ఉపయోగించకూడదనే విషయాలు మరిచిపోతున్నారు. ఈ విషయాన్నే తాజా అధ్యయనం తెలిపింది. ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడించింది.
కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తుందట..
స్కిన్ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వాడకం వల్ల ఇండియాలో కిడ్నీ సమస్యల కేసులు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ క్రీమ్లలో అధిక మొత్తంలో పాదరసం ఉంటుందని.. అది మూత్రపిండాలకు హాని కలిగిస్తుందని చెప్తున్నారు. కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయనం గురించి ప్రచురించారు. అధిక మెర్క్యూరీ కంటెంట్ ఉన్న ఫెయిర్‌నెస్ క్రీములను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెంబ్రానస్ నెఫ్రోపతీ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. ఈ సమస్య కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తుందని తెలిపింది.
చర్మం ద్వారా పాదరసం లోపలికి పోతుంది..
మెంబ్రానస్ నెఫ్రోపతీ MN అనేది ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇది ప్రోటీన్ లీకేజికి కారణమవుతుంది. దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడి మూత్రపిండ సమస్యలకు దారి తీస్తుంది. దీనివల్ల శరీరం నుంచి మూత్రం రూపంలో ప్రోటీన్‌ను విసర్జించేలా చేస్తుంది. మాయిశ్చరైజర్‌లోని పాదరసం చర్మం ద్వారా లోపలికి వెళ్లిపోతుంది. ఇది మూత్రపిండాల ఫిల్టర్లను నాశనం చేస్తుంది. ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని స్టడీలో పాల్గొన్న పరిశోధకులు తెలిపారు.
ఉపయోగించి మానేస్తే.. చర్మం రంగు మారిపోతుందట..
ఇండియాలో లభించే బ్యూటీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు త్వరిత ఫలితాలను ఇస్తాయి. వాటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే వాటి ఫలితాలు బాగున్నాయనే ఉద్దేశంతో చాలామంది వాటిని రెగ్యూలర్‌గా ఉపయోగిస్తూ ఉంటారు. పైగా ఒకసారి క్రీమ్‌ను ఉపయోగించి వాటిని ఆపేస్తే చర్మం మరింత ముదురు రంగులోకి మారుతుంది. అందుకే వీటిని వాడడం ఆపరు. వాటివల్ల వినియోగం పెరిగి.. అది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జూలై 2021 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య మెంబ్రానస్ నెఫ్రోపతి కేసులను అధ్యయనం చేసి ఈ ఫలితాలు వెల్లడించారు.
లక్షణాలు ఎలా ఉంటాయంటే..
మేకప్ వల్ల కిడ్నీ సమస్యలు వస్తే.. అలసట, నురుగతో కూడిన మూత్రం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు పెరుగుతాయి. రోగి మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్‌ను అభివృద్ధి చేస్తుంది. మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. కొన్ని సందర్భరాల్లో ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. అందుకే ఫెయిర్‌నెస్ క్రీముల వాడకాన్ని నిలిపివేయాలని సూచిస్తున్నారు నిపుణులు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే ఈ ఫెయిర్‌నెస్ క్రీముల వినియోగాన్ని తగ్గించాలి అంటున్నారు.
Also Read : టైప్ 2 డయాబెటిస్‌ను దూరం చేసే ఫుడ్ ఇదే.. రెగ్యూలర్‌గా తీసుకుంటే చాలా మంచిదంటున్న తాజా అధ్యయనం