Healthy Breakfast : హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లలో లో కార్బ్ బ్రేక్‌ఫాస్ట్ (Low carb Breakfast) మంచిది. ఇది మీరు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది అలాగే పోషకాలు అందిస్తుంది. బరువు తగ్గేందుకు ట్రై చేస్తుంటే మీరు కీటో పోహాను మీ డైట్లో చేర్చుకోవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కుగా ఉంటుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్, ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీనిని మీరు కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా తీసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
కాలీ ఫ్లవర్ - 200 గ్రాములు
ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - చిటికెడు
కరివేపాకు - 1 రెబ్బ
ఉల్లిపాయ - 1
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
పల్లీలు - గుప్పెడు
పచ్చిమిర్చి - 2
అటుకులు - 200 గ్రాములు
నిమ్మరసం - 1 స్పూన్
కొత్తిమీర - గార్నిష్ కోసం
తయారీ విధానం
ముందుగా కాలీఫ్లవర్‌ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే దానిలో పురుగులు ఉండిపోతాయి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఉడికించాలి. ఇలా చేస్తే కాలీఫ్లవర్ మెత్తగా అవుతుంది. అంతే కాకుండా దానిలోని మలినాలు పోతాయి. అవి ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని బాగా కడిగి.. సన్నగా ముక్కలు చేసుకోవాలి. అటుకులను కడిగి.. నీరు లేకుండా పిండి.. పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టండి. అది వేడి అయ్యాక దానిలో ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడి చేయండి. నూనె వేగిన తర్వాత దానిలో పల్లీలు వేసి వేయించుకోవాలి. కాస్త క్రిస్పీగా వచ్చినప్పుడు ఆవాలు వేసి వేయించాలి. దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. ఉప్పు, పసుపు కూడా అప్పుడే వేయిస్తే మంచిది. కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలి. మరోసారి బాగా కలిపి దానిలో కాలీఫ్లవర్ వేసి మగ్గనివ్వాలి.
కాలీఫ్లవర్ మగ్గిన తర్వాత అటుకులు వేసి బాగా కలపాలి. ఓ రెండు నిమిషాలు అలాగే ఉంచి.. స్టౌవ్ ఆపేయండి. దానిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడి కీటో పోహా రెడీ. ఇది తక్కువ కార్బ్స్ కలిగిన అల్పాహారం. దీనిలో కొవ్వు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మీరు కీటో డైట్ చేస్తుంటే దీనిని మీరు రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి హెల్ప్ చేయడంతో పాటు.. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
Also Read : స్పాంజ్‌లాంటి సెట్ దోశల కోసం ఈ రెసిపీని ఫాలో అయిపోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.