చాలా మందికి విదేశీ పర్యటనలు చేయాలని ఆశగా ఉంటుంది. ఆయా దేశాల్లోని ప్రకృతి అందాలను, వింతలు-విశేషాలు, అద్భుత కట్టడాలను చూడాలని ఉంటుంది. కానీ, విదేశీ పర్యటనలు అంటే మాటలా? బోలెడంత ఖర్చు అవుతుందని భయపడతారు. అలాంటి వారి కోసమే ఈ డీటైల్స్. తక్కువ ఖర్చుతో వెళ్లొచ్చే కొన్ని దేశాలున్నాయి. అవేంటో? అక్కడికి వెళ్లి రావాలంటే ఎంత ఖర్చు అవుతుందో? ఇప్పుడు తెలుసుకుందాం.
భూటాన్
భారత్ కు సమీప దేశం భూటాన్. ఎంతో అందమైన దేశం. ప్రకృతి అందాలకు నెలవైన దేశం. తక్కువ ఖర్చుతో, అత్యంత సులభంగా వెళ్లగలిగే దేశం. విమాన సౌకర్యంతో పాటు రోడ్డు మార్గం ద్వారా సైతం భూటాన్ కు వెళ్లొచ్చు. కోవిడ్ నేపథ్యంలో విదేశీ పర్యటకులను భూటాన్ అనుమతించడం లేదు.సెప్టెంబరు 23న పర్యాటకులను అధికారులు అనుమతించబోతున్నారు. ఇందుకోసం అస్సాం సరిహద్దు వెంబడి సంద్రుప్ జొంగ్‌ఖార్తో పాటు గెలెఫు దగ్గర ఉన్న భారత్-భూటాన్ సరిహద్దు గేట్లను తిరిగి ఓపెన్ చేయబోతున్నారు.
నేపాల్
భారత్ పొరుగు దేశం నేపాల్. అందమైన దృశ్యాలు, వాస్తుశిల్పాలతో అద్బుత సౌదర్యాన్ని కలిగి ఉంది. ప్రసిద్ధ మౌంట్ ఎవరెస్ట్‌ను సైతం దగ్గర నుంచి చూడొచ్చు. రాజధాని ఖాట్మండు చూడదగిన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ పోఖారాను చూడవచ్చు. ట్రెక్కింగ్ చేసేవారికి హిమాలయాలకు ప్రవేశ ద్వారం ఇక్కడి నుంచే ఉంటుంది. స్వయంభూనాథ్ (మంకీ టెంపుల్), బౌధనాథ్ స్థూపం (బోధనాథ్), భక్తపూర్ లోని దర్బార్ స్క్వేర్ కొన్ని ప్రధాన ఆకర్షణలు. విమాన రౌండ్ టిక్కెట్ ధర కేవలం రూ. 14,000 (రౌండ్‌ట్రిప్).
థాయిలాండ్
సులభమైన వీసా నిబంధనలు, సరసమైన విమాన ధరలతో థాయిలాండ్ భారతీయుల పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. దేవాలయాలు, నదీ విహారయాత్రలు, కో స్యామ్యూయ్, ఫుకెట్, క్రాబీ ఐలాండ్, పట్టాయాలోని సహజమైన బీచ్‌లు, ప్రపంచ ప్రసిద్ధ బ్యాంకాక్ సొగసులు.. చెప్పుకుంటూ పోతే చూడ్డానికి ఎన్నో ఉన్నాయి. సీ ఫుడ్ ప్రియులకు థాయిలాండ్ స్వర్గధామంగా చెప్పుకోవచ్చు. బీచ్‌లు మాత్రమే కాకుండా, వాట్ అరుణ్, వాట్ ఫో, ఎమరాల్డ్ బుద్ధ టెంపుల్ (వాట్ ఫ్రా కైవ్) యొక్క ఐకానిక్ దేవాలయాలను సందర్శించే అవకాశం ఉంది. ఫ్లైట్ రౌండ్ టికెట్ ధర కేవలం రూ. 22,000 (రౌండ్ ట్రిప్).
మలేషియా
భారత టూరిస్టులు తప్పక సందర్శించవలసిన ఆధునిక కాలపు అద్భుతం. కౌలాలంపూర్ యొక్క స్కైలైన్ దాని ఎత్తైన, ఆకాశాన్ని తాకే భవనాలు, పెట్రోనాస్ టవర్ లాంటి భారీ నిర్మాణాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. బుకిట్ బింటాంగ్ షాపింగ్ జిల్లా కూడా ప్రసిద్ధి చెందింది. లెగోలాండ్ మలేషియా, లంకావి కేబుల్ కార్, లంకావి స్కై బ్రిడ్జ్, ఇస్లామిక్ ఆర్ట్స్ మ్యూజియం, మనుకాన్ ఐలాండ్ సహా మరెన్నో ప్రదేశాలను సందర్శించవచ్చు. విమాన టిక్కెట్ ధర కేవలం రూ. 22,000 (రౌండ్‌ట్రిప్) మాత్రమే.
వియత్నాం
అందమైన బీచ్‌లు, నదులు, దేవాలయాలతో అద్భుతగా ఉంటుంది వియత్నాం. రాజధాని హో చి మిన్ సిటీ (గతంలో సైగాన్)లో ఫ్రెంచ్ కలోనియల్ మైలురాళ్లు, వియత్నామీస్ యుద్ధ చరిత్ర మ్యూజియంలు, సి చి సొరంగాలు చూపరులను ఆకట్టుకుంటాయి. హోయి అన్, సా పా (సాపా), హా లాంగ్ బే, మెకాంగ్ డెల్టా వియత్నాంలోని కొన్ని అందమైన ప్రదేశాలు. ఇక్కడికి వెళ్లేందుకు విమాన టికెట్ ధర కేవలం రూ. 23,000 (రౌండ్‌ట్రిప్)
కంబోడియా
ఈ ఆగ్నేయాసియా దేశం పర్యాటకులకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. సీమ్ రీప్‌తో పాటు అతిపెద్ద హిందూ ఆలయం ఆంగ్‌కోర్ వాట్ కంబోడియాలో హైలైట్ గా చెప్పుకోవచ్చు. నమ్ పెన్, సిహనౌక్విల్లే బీచ్‌లు, బట్టంబాంగ్‌లోని పట్టణాలు, మొండుల్కిరిలోని విస్తారమైన వరి పొలాలు, నమ్ పెన్‌లోని రాయల్ ప్యాలెస్ తప్పక సందర్శించవలసిన ప్రదేశాలలో కొన్ని. విమాన టిక్కెట్ ధర కేవలం రూ. 42,000 (రౌండ్‌ట్రిప్)
జార్జియా
జార్జియా అత్యంత సుందర ప్రదేశం. రాజధాని టిబిలిసి రాళ్లతో నిండి ఉంది. కాకసస్ పర్వత శ్రేణిని కలిగి ఉంది. ఇక్కడి గ్రామాలు ఎంతో సుందరంగా ఉంటాయి. 12వ శతాబ్దానికి చెందిన విశాలమైన గుహ మఠమైన వార్డ్జియా అత్యంత ప్రసిద్ధమైనది. అందమైన నల్ల సముద్ర తీరాలు అనేకం ఉన్నాయి. ఫ్లైట్ రౌండ్ టికెట్ ధర కేవల రూ. 40,000 (రౌండ్ ట్రిప్).