దేశంలోనే ప్రతిష్మాత్మక పరీక్షలుగా భావించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2023 నిర్వహణకు యూపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశవ్యాప్తంగా మే 28న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనుంది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోని అభ్యర్థులు వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాల్‌టికెట్‌లో ఫోటో సరిగాలేనివారు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ ఏడాదికి గాను మొత్తం 1105 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 37 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. తెలుగు రాష్ట్రాల ఈసారి కూడా భారీగానే అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా 72 నగరాల్లో దాదాపు 3 వేల పరీక్ష కేంద్రాల్లో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు యూపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 50,646 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. వీరికోసం హైదరాబాద్ జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలను, వరంగల్ నగరంలో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 45,611 మంది పరీక్ష రాయనుండగా, వరంగల్‌లో 5,035 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇక ఏపీ నుంచి కూడా దాదాపు 40 వేల వరకు అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 28న రెండు సెషన్లుగా పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రంలోని అభ్యర్థులను అనుమతించరు. అంటే ఉదయం 9.20 గంటల వరకు, మధ్యాహ్నం 2.20 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
★ పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందు వరకే అభ్యర్థులును పరీక్ష కేంద్రంలోని అనుమతిస్తారు. కాబట్టి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి.
★ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ తీసుకెళ్లాలి. లేకపోతే అనుమతించరు. హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
★ ఓఎంఆర్ షీట్‌ను కేవలం బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతో మాత్రమే నింపాలి.
★ పరీక్ష కేంద్రంలోని మొబైల్ ఫోన్లు, పేజర్లు, ప్రోగ్రామబుల్ డివైజ్‌లను, పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచీలు, కెమెరా, బ్లూటూత్ డివైజ్‌లతోపాటు మరే ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతించరు.
ఎంపిక విధానం: మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం..
➥ ప్రిలిమ్స్ పరీక్ష విధానం:
మొత్తం 400 మార్కులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి.
➥ మెయిన్స్ పరీక్ష విధానం:
మొత్తం 1750 మార్కులకు యూపీఎస్సీ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) ఉంటుంది. ఇవి రెండు కలిపి 2025 మార్కులకు తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. అయితే వీటిలో ఒక్కో పేపరుకు 300 మార్కుల చొప్పున క్వాలిఫయింగ్ పేపర్లు(పేపర్-ఎ, పేపర్-బి) ఉంటాయి. వీటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.02.2023.
➥ ప్రిలిమ్స్ పరీక్ష తేది: 28.05.2023.
పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తారు.