తెలంగాణలోని నిరుద్యోగులు త్వరలోనే మరో ఉద్యోగ కబురు విననున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్‌-2, 3 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తిచేసింది. ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్లు సమాచారం. వీటితోపాటు టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన మిగతా పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కమిషన్ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ విభాగాల్లోని మరికొన్ని పోస్టులను గ్రూప్‌-2, 3 పరిధిలోకి తీసుకురావడంతో వాటి సంఖ్య పెరగనుంది. గ్రూప్‌-2 పరిధిలోకి దాదాపు 120 వరకు కొత్తగా పోస్టులు రావడంతో.. ఈ ప్రకటన కింద మొత్తం 783 ఖాళీలు వెల్లడయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది. గ్రూప్‌-3లో పెరగనున్న పోస్టులపై కమిషన్ కార్యాచరణ పూర్తిచేసింది. ఇందులో భాగంగా నెలాఖరులోగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.


పెరిగిన పోస్టుల సంఖ్య..
ఆగస్టు 30న గ్రూప్-2 పరిధిలో 663, గ్రూప్-3 పరిధిలో 1,373 పోస్టులను గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటికి అదనంగా వేర్వేరు విభాగాల్లో గ్రూప్-2, గ్రూప్-3 స్థాయి కలిగిన మరిన్ని ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటన్నిటికీ కలిపి నోటిఫికేషన్లు జారీచేసి భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించింది. కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో సంక్షేమశాఖల్లో ఎస్సీ(17), ఎస్టీ(9), బీసీ (17) అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు కలిపి 43 వరకు గ్రూప్-2 పరిధిలోకి వచ్చాయి. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని జువైనల్ సర్వీసు విభాగంలో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులతో పాటు ప్రభుత్వశాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కలిపి గ్రూప్-2లో 100 వరకు పోస్టులు పెరగనున్నాయి. అదేవిధంగా గ్రూప్-3 పరిధిలోకి ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్‌లో అకౌంటెంట్ పోస్టులు,  గిరిజన సంక్షేమ సేవలు), ఇతర విభాగాధిపతుల కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్‌తో పాటు వీటికి సమానమైన ఉద్యోగాల్ని చేర్చింది. దీంతో మొదట అనుమతించిన 1,373 పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులు పెరగనున్నాయి.


గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడంటే?
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు హాజరైన 2,85,916 మంది అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ పూర్తిచేసింది. పరీక్ష తుది కీని కూడా ప్రకటించింది. ఫలితాల వెల్లడికి సంబంధించి వివాదం హైకోర్టులో ఉంది. కోర్టు తీర్పు అనంతరం 10 నుంచి 15 రోజుల్లో ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.


Also Read:


వరంగల్‌లో డిసెంబరు 17న జాబ్ మేళా, అందరూ అర్హులే! వేదిక ఇదే!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్, డిసెంబరు 17న వరంగల్ ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ సమీపంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. కరీంనగర్ వెంకట సాయి ఎంటర్ ప్రైజెస్ కంపెనీలో 121 ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.
జాబ్ మేళా పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్-2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ లేదా జులైలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...