పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇతర పరీక్షలు ఉండటంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన విన్నపంతో పోలీసు నియామక మండలి మార్పులు చేసింది. దీంతో ఏప్రిల్ 23న జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్ష ఏప్రిల్ 30కి వాయిదా పడింది. కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షను కూడా ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30కి మార్చారు. అదే విధంగా మార్చి 12న జరగాల్సిన ఎ‌స్‌ఐ(ఐటీ) పరీక్షను మార్చి 11కి మార్చారు. ఇక ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్) పరీక్షను కూడా మార్చి 12 నుంచి 11కి మార్చారు.

  


మారిన ఫైనల్ పరీక్షల షెడ్యూలు ఇలా.. 


➥ మార్చి 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (IT&CO) టెక్నికల్ పేపర్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ ఏఎస్‌ఐ(FPB) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ మార్చి 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ (PTO) టెక్నికల్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఏప్రిల్ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు టెక్నికల్ పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎస్సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులకు టెక్నికల్ పేపర్ పరీక్షలు నిర్వహిస్తారు.


➥ ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ(సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు.


➥ ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సీటీ కానిస్టేబుల్(సివిల్), ఇతక కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సీటీ కానిస్టేబుల్(IT&CO) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు. 


తెలంగాణలో పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 8 నుంచి జనవరి 5 వరకు ఫిజికల్ ఈవెంట్లు (పీఎంటీ, పీఈటీ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన ఫలితాలను జనవరి 6న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. పోలీసు ఫిజికల్ ఈవెంట్లకు రాష్ట్రవ్యాప్తంగా 2,07,106 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 1,11,209 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 2018-19లో జ‌రిగిన రిక్రూట్‌మెంట్‌తో పోల్చితే, ఇప్పుడు అద‌నంగా 5.18 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయిన‌ట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.


ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 12 నుంచి తుది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9న సివిల్‌ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 23న అన్ని రకాల కానిస్టేబుల్‌ పోస్టులకు మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్‌ చేసుకోచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.